
అబద్ధాల వర్షం కురిపించారు
♦ టీడీపీ మహానాడు తీరుపై అంబటి ధ్వజం
♦ భూముల్ని సింగపూర్‌కు ఇవ్వాలనుకుంటున్న బాబు రాక్షసుడా?
♦ ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు రాక్షసులా? అని నిలదీత
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబునాయుడు, ఇతర నేతలు అబద్ధాల వర్షం కురిపించి ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో అధికారంలోకొచ్చాక జరిగిన రెండో మహానాడులో తొలి ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను ఎంతమేరకు నెరవేర్చామనే విషయం చెప్పలేదని విమర్శించారు. ‘‘రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కానేకాదు. విజయవాడ-గుంటూరు పరిసరాల్లో రాజధాని నిర్మాణాన్ని మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారు.
అయితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా వాటిని విస్మరించి రైతులనుంచి పచ్చటి పొలాల్ని బలవంతంగా లాక్కోవడాన్నే మేం తీవ్రంగా వ్యతిరేకించాం. రాజధానికోసం అటవీ భూములనైనా సరే డీనోటిఫై చేసి ఇస్తామని కేంద్రం విభజన చట్టంలో పొందుపరిస్తే దాన్ని పట్టించుకోకపోవడాన్నే ప్రశ్నించాం’’ అని తెలిపారు. వెనకటికి హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్ని చాపలా చుట్టి సముద్రంలో ముంచేయాలని చూస్తే ఆదివిష్ణువు వరాహావతారం ఎత్తి భూమి మునిగిపోకుండా కాపాడారని, ఇపుడూ చంద్రబాబు హిరణ్యాక్షుడిలాగా పచ్చటి పంటపొలాల్ని చాపచుట్టి సింగపూర్‌కు ఇచ్చేయాలని చూస్తూంటే తమతోపాటుగా రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతిఘటిస్తున్నాయని అన్నారు.
భూమిని సింగపూర్‌కు ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు రాక్షసుడా? లేక ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు రాక్షసులా? అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను ఎందరినో చేరదీసి పదవులిచ్చి పెద్దవారిని చేస్తే విశ్వాసం లేకుండా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని, గడ్డి తినే గొర్రెకున్నంత విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని బాబు మహానాడులో చెప్పిన కథను ఆయనకే అన్వయించుకోవాలన్నారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని తమ పార్టీ నిర్ణయించడం సరైన నిర్ణయమని అంబటి చెప్పారు.