చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారు
హైదరాబాద్: దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం విషయంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించారని, వైఎస్ జగన్ ఈ విషయం గురించి డాక్టర్, కలెక్టర్‌ను అడిగారని చెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడం చట్టవిరుద్ధమని, పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని పంపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారని, చట్టం గురించి మాట్లాడటం తప్పా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రశ్నించాకే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో నీతినిజాయితీ ఉన్నవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడేవారు ఉన్నారని అంబటి అన్నారు. ముఖ్యమంత్రులు పదవిలో ఐదేళ్లే ఉంటారని, ఐఏఎస్‌లు చాలాకాలం ఉంటారని చెప్పారు. వ్యవస్థలు శాశ్వతం తప్ప వ్యక్తులు కాదన్న విషయం మరిచిపోవద్దని, చంద్రబాబు చెప్పినట్టు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు జేబులో బొమ్మల్లా ఉండొద్దని, ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఉందని, ప్రతిపక్ష నేతను గౌరవించాలని అన్నారు. దివాకర్ ట్రావెల్స్ నిబంధనలు పాటించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని, అసలు నేరస్తులను వదిలి వైఎస్ జగన్‌ను నేరస్తునిగా చిత్రీకరించే యత్నం సరికాదనన్నారు. చంద్రబాబే అధికారులతో మాట్లాడిస్తున్నారని, వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని, ఓటుకు కోట్లు కేసులో తప్పించుకునేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుని తిరుగుతున్నాని విమర్శించారు.