కె.గంగవరం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం జరిగింది. జిల్లాలోని కె.గంగవరం, కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెం సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. కె.గంగవరం సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు మంగళవారం ఉదయం ధర్నా, రాస్తారోకో చేశారు. కాకినాడ- కోటిపల్లి ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు రెండు గంటల సేపు జరిగిన రాస్తారోకో వల్ల రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. రామచంద్రపురం సీఐ కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం, ద్రాక్షరామ ఎస్సైలు ప్రసాద్, రెహ్మాన్‌లు దళిత నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మ చైర్మన్ అల్లూరి దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ తదితరులతో కొంతసేపు చర్చించారు. అయినా ఆందోళనకారులు వినలేదు. అనంరతం భారీ ర్యాలీగా స్థానిక పోలీస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
సీఐతో దళిత నాయకుల చర్చలు
స్థానిక పోలీస్టేషన్‌కు చేరుకున్న సీఐ కాశీవిశ్వనాథ్‌తో వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, దళిత ఐక్యవేదిక నాయకులు మద్దా కృష్ణమూర్తి తదితర దళిత నాయకులు చర్చలు జరిపారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇచ్చారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు.మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బత్తుల అప్పారావు, సర్పంచ్‌లు జనిపెల్ల సాయి, గోవిందరాజు, ఎంపీటీసీ సుజాత, దళిత నాయకులు కూర్మారాజు, గనిరాజు, భీమశంకరం, తోకల శ్రీను, శ్రీహరి పాల్గొన్నారు.
కమ్మిరెడ్డిపాలెం సెంటర్‌లో..
కొత్తపేట : స్థానిక కమ్మిరెడ్డిపాలెం సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి కాగితాలతో కాల్చి దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం స్థానికులు విషయాన్ని గుర్తించి రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజుకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై డివిజయకుమార్‌కు ఆయన విషయాన్ని చెప్పారు. తన కుమారుడు, మండల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కన్వీనర్ స్వరూప్‌రాజ్‌ను సంఘటనా స్థలానికి పంపించి ఆందోళన చేయకుండా విగ్రహాన్ని శుద్ధిచేయాలని డేవిడ్‌రాజు సూచించారు. దీంతో స్వరూప్, దళిత యూత్ నాయకుడు బీరా ఇస్సాక్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని శుద్ది చేశారు. ఎస్సై విజయకుమార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్సై తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దుండగులు అవమానించడంపై వైఎస్సార్‌సీపీ నేత డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం
Published Wed, Mar 9 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement