సాక్షి, అమరావతి: ‘పెద్దన్న’ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి విదేశీ నిపుణుల రాకపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే అమెరికా కంపెనీలు మాత్రం వారే ముద్దని తేల్చి చెబుతున్నాయి. ‘రండి రండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..’ అని విదేశీ నిపుణులకు ఆహ్వాన గీతం ఆలపిస్తున్నాయి. విదేశీ నిపుణులతోనే తమ కంపెనీల వృద్ధి ముడిపడి ఉందని కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికాలో తాజాగా నిర్వహించిన ‘ఇమిగ్రేషన్ ట్రెండ్స్–2020’ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎన్వాయ్ గ్లోబల్, హ్యారీష్ పోల్ సర్వే సంస్థలు సంయుక్తంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఈ సర్వే నిర్వహించాయి. అమెరికాలోని 400కిపైగా కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలను సంప్రదించి వృత్తి నిపుణులు, ఉద్యోగుల నియామకంలో ఆ కంపెనీల ప్రాధాన్యతలను తెలుసుకున్నాయి.
ఇలాగైతే ఇబ్బందే.. కెనడా వెళ్లిపోతాం
ప్రస్తుతం అమెరికాలో వీసా నిబంధనలను కఠినతరం చేయడం తమకు పెద్ద సమస్యగా మారిందని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా విదేశీ నిపుణుల నియామక ప్రక్రియ అనుకున్న విధంగా సాగడం లేదని చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విదేశీ నిపుణులకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ జారీ చేయాలని అమెరికాలోని 71 శాతం కంపెనీలు కోరుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్, పారిశ్రామికంగా అంతగా ప్రసిద్ధి చెందని నగరాలు, ప్రాంతాల్లో నెలకొల్పే కంపెనీల్లో విదేశీ నిపుణులు పనిచేసేందుకు ఈ విధానం కింద సులభంగా వీసాలు జారీ చేయాలని సూచిస్తున్నాయి. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితే కొనసాగితే తాము కెనడాకు తరలి పోవాల్సి వస్తుందని 40 శాతం అమెరికా కంపెనీలు చెబుతుండటం గమనార్హం.
ఉద్యోగాలకు అర్హులైన అమెరికన్లు ఏరి?
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గట్టిగా చెబుతున్నా వారు మాత్రం ఉద్యోగాలు చేసేందుకు సుముఖత చూపడం లేదని సర్వేలో వెల్లడైంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2019 నవంబర్ నాటికి అమెరికాలో 6.80 మిలియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 5.80 మిలియన్ల మంది అమెరికన్లే ఉద్యోగాలు చేసేందుకు సానుకూలత ప్రదర్శించారు. అంటే ఒక మిలియన్ ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన అమెరికన్లు లేరు. ఇదే పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అర్హులైన నిపుణులను నియమించుకోవాలంటే విదేశీయులపై ఆధారపడక తప్పదని అమెరికా కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.
విదేశీ నిపుణులకు జై
- అమెరికాలోని 93 శాతం కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వేలో తేలింది.
- తమ కంపెనీల వృద్ధి వ్యూహంలో విదేశీ నిపుణుల నియామకం కీలక అంశంగా భావిస్తున్నాయి.
- అత్యంత నైపుణ్యం అవసరమైన కీలక పోస్టుల్లో విదేశీయుల నియామకానికే మొగ్గు చూపాయి.
- విదేశీ నిపుణులు తమ కంపెనీల ఎదుగుదలలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నట్లు 50 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి.
- విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు స్పాన్సర్ చేసినట్లు 71 శాతం కంపెనీలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment