Foreign experts
-
6న విదేశీ నిపుణుల బృందం పోలవరం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను ఈనెల 6వ తేదీన విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, బావర్, మేఘ ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోనున్నారు.ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజ్ వాటర్ తొలగించే పనులు జరుగుతున్నాయి. నీటిని తొలగించిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. బృందం సభ్యులు కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంపై చర్చించిన అనంతరం తుది నివేదిక తయారు చేస్తారని అధికారులు తెలిపారు. -
ఏడు దేశాలకు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు
న్యూఢిల్లీ: బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని మరో ఏడు దేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని వివిధ పరిమాణాల్లో ఎగుమతి చేయవచ్చని సూచించింది. నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల ద్వారా మాత్రమే బియ్యం ఎగుమతులకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు దేశాలకు 10,34,800 టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని పేర్కొంది. నేపాల్‌కు 95,000 టన్నులు, కామెరూన్‌కు 1,90,000 టన్నులు, ఐవొరీ కోస్ట్‌కు 1,42,000, రిపబ్లిక్ ఆఫ్ గినియాకు 1,42,000, మలేíÙయాకు 1,70,000, ఫిలిప్పైన్స్కు 2,95,000 టన్నుల తెల్లబియ్యం ఎగుమతులకు అనుమతి మంజూరు చేసింది. యూఏఈ, సింగపూర్ దేశాలకు కూడా బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. -
మీరే కావాలి!
సాక్షి, అమరావతి: ‘పెద్దన్న’ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి విదేశీ నిపుణుల రాకపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే అమెరికా కంపెనీలు మాత్రం వారే ముద్దని తేల్చి చెబుతున్నాయి. ‘రండి రండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..’ అని విదేశీ నిపుణులకు ఆహ్వాన గీతం ఆలపిస్తున్నాయి. విదేశీ నిపుణులతోనే తమ కంపెనీల వృద్ధి ముడిపడి ఉందని కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికాలో తాజాగా నిర్వహించిన ‘ఇమిగ్రేషన్ ట్రెండ్స్–2020’ నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎన్వాయ్ గ్లోబల్, హ్యారీష్ పోల్ సర్వే సంస్థలు సంయుక్తంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇటీవల ఈ సర్వే నిర్వహించాయి. అమెరికాలోని 400కిపైగా కంపెనీల హెచ్ఆర్ విభాగాలను సంప్రదించి వృత్తి నిపుణులు, ఉద్యోగుల నియామకంలో ఆ కంపెనీల ప్రాధాన్యతలను తెలుసుకున్నాయి. ఇలాగైతే ఇబ్బందే.. కెనడా వెళ్లిపోతాం ప్రస్తుతం అమెరికాలో వీసా నిబంధనలను కఠినతరం చేయడం తమకు పెద్ద సమస్యగా మారిందని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా విదేశీ నిపుణుల నియామక ప్రక్రియ అనుకున్న విధంగా సాగడం లేదని చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విదేశీ నిపుణులకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ జారీ చేయాలని అమెరికాలోని 71 శాతం కంపెనీలు కోరుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్, పారిశ్రామికంగా అంతగా ప్రసిద్ధి చెందని నగరాలు, ప్రాంతాల్లో నెలకొల్పే కంపెనీల్లో విదేశీ నిపుణులు పనిచేసేందుకు ఈ విధానం కింద సులభంగా వీసాలు జారీ చేయాలని సూచిస్తున్నాయి. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితే కొనసాగితే తాము కెనడాకు తరలి పోవాల్సి వస్తుందని 40 శాతం అమెరికా కంపెనీలు చెబుతుండటం గమనార్హం. ఉద్యోగాలకు అర్హులైన అమెరికన్లు ఏరి? అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గట్టిగా చెబుతున్నా వారు మాత్రం ఉద్యోగాలు చేసేందుకు సుముఖత చూపడం లేదని సర్వేలో వెల్లడైంది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2019 నవంబర్ నాటికి అమెరికాలో 6.80 మిలియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 5.80 మిలియన్ల మంది అమెరికన్లే ఉద్యోగాలు చేసేందుకు సానుకూలత ప్రదర్శించారు. అంటే ఒక మిలియన్ ఉద్యోగాలు చేసేందుకు అర్హులైన అమెరికన్లు లేరు. ఇదే పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అర్హులైన నిపుణులను నియమించుకోవాలంటే విదేశీయులపై ఆధారపడక తప్పదని అమెరికా కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. విదేశీ నిపుణులకు జై - అమెరికాలోని 93 శాతం కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వేలో తేలింది. - తమ కంపెనీల వృద్ధి వ్యూహంలో విదేశీ నిపుణుల నియామకం కీలక అంశంగా భావిస్తున్నాయి. - అత్యంత నైపుణ్యం అవసరమైన కీలక పోస్టుల్లో విదేశీయుల నియామకానికే మొగ్గు చూపాయి. - విదేశీ నిపుణులు తమ కంపెనీల ఎదుగుదలలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నట్లు 50 శాతం యాజమాన్యాలు వెల్లడించాయి. - విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు స్పాన్సర్ చేసినట్లు 71 శాతం కంపెనీలు తెలిపాయి. -
వైట్ హౌస్‌కు ‘హెచ్1బీ’ సవరణలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాకు సంబంధించి సవరించిన నిబంధనలు వైట్‌హౌస్‌కు చేరుకున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇకపై ఉద్యోగం చేసుకునేందుకు వీలులేకుండా వీటిని రూపొందించారు. వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ బడ్జెట్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్పించిన ఈ ప్రతిపాదనల కారణంగా 90,000 మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇలా నష్టపోయేవారిలో భారతీయులే పెద్ద సంఖ్యలో ఉన్నారని అధికారులు అంటున్నారు. అమల్లోకి వచ్చేందుకు మరింత సమయం అయితే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాలపై నిషేధం విధిస్తున్న ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనలపై శ్వేతసౌధం సమీక్ష నిర్వహిస్తుందనీ, వేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. ఓసారి ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త హెచ్1బీ నిబంధనలకు వైట్‌హౌస్ ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఈ నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్లో 30 రోజుల కాలపరిమితితో పబ్లిష్ చేస్తారు. ఈ గడువు ముగిశాక నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు. మనవారే ఎక్కువమంది హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా పనిచేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్లంతా అమెరికాలోనే ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అందరికంటే ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందారు. అమెరికా ప్రభుత్వం జారీచేసిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులే దక్కించుకున్నారు. అయితే విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్1బీ వీసా నిబంధనల్ని సవరిస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలతో పాటు టెక్నాలజీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ హెచ్1బీ నిబంధనల విషయంలో ట్రంప్ మొండిగా ముందుకెళుతున్నారు. నష్టపోతామంటున్న నిపుణులు హెచ్1బీ జీవిత భాగస్వాముల్ని ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని సెనెటర్ కమలా హారిస్ సహా పలువురు చట్టసభ్యులు, సిలికాన్ వ్యాలీ కంపెనీలు ట్రంప్‌ను కోరుతున్నాయి. లేదంటే నిపుణులను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ అమెరికా’ సంస్థ వాషింగ్టన్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ వేసింది. కాగా, ఇటీవల అమెరికా పాక్షిక షట్‌డౌన్ నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రక్రియను కోర్టు నెల పాటు వాయిదా వేసింది. తాజాగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోర్టుకు తెలపనుంది. ప్రస్తుతం అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాపై పనిచేస్తుండగా, వీరిలో 3,09,986 మంది భారతీయులే. -
హిందూ మతంపై విజ్ఞాన సర్వస్వం సిద్ధం!
కొలంబియా: హిందూ మతంపై సమగ్ర విజ్ఞాన సర్వస్వం సిద్ధమైంది. దేశ విదేశీ నిపుణులు పాతికేళ్లపాటు శ్రమించి 11 సంపుటాలు రూపొందించారు. ఒక్కో దాంట్లో దాదాపు 700 పేజీలు ఉన్నాయి. స్వామి చిదానంద సరస్వతి స్థాపించిన భారతీయ సంస్కృతి పరిశోధన సంస్థ, సౌత్ కరోలిన వర్సిటీ ఉమ్మడి కృషితో ఇది రూపుదాల్చింది. వెయ్యికి పైగా ఫోటోలతోపాటు 7 వేల ఆంగ్ల వ్యాసాలు ఇందులో ఉన్నాయి. హిందూ మత సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, తాత్విక అంశాలు, చరిత్ర, భాషలు తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. సౌత్ కరోలినలో వచ్చే వారం దీన్ని ఆవిష్కరించనున్నారు.