వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాకు సంబంధించి సవరించిన నిబంధనలు వైట్‌హౌస్‌కు చేరుకున్నాయి. అమెరికాలో హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇకపై ఉద్యోగం చేసుకునేందుకు వీలులేకుండా వీటిని రూపొందించారు. వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఫర్ బడ్జెట్‌కు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్పించిన ఈ ప్రతిపాదనల కారణంగా 90,000 మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇలా నష్టపోయేవారిలో భారతీయులే పెద్ద సంఖ్యలో ఉన్నారని అధికారులు అంటున్నారు.
అమల్లోకి వచ్చేందుకు మరింత సమయం
అయితే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాలపై నిషేధం విధిస్తున్న ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనలపై శ్వేతసౌధం సమీక్ష నిర్వహిస్తుందనీ, వేర్వేరు ప్రభుత్వ విభాగాలతో పాటు సంస్థల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. ఓసారి ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త హెచ్1బీ నిబంధనలకు వైట్‌హౌస్ ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఈ నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్‌లో 30 రోజుల కాలపరిమితితో పబ్లిష్ చేస్తారు. ఈ గడువు ముగిశాక నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
మనవారే ఎక్కువమంది
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు కూడా పనిచేసుకునే అవకాశం కల్పిస్తే వాళ్లంతా అమెరికాలోనే ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అందరికంటే ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందారు. అమెరికా ప్రభుత్వం జారీచేసిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులే దక్కించుకున్నారు. అయితే విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్1బీ వీసా నిబంధనల్ని సవరిస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలతో పాటు టెక్నాలజీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ హెచ్1బీ నిబంధనల విషయంలో ట్రంప్ మొండిగా ముందుకెళుతున్నారు.
నష్టపోతామంటున్న నిపుణులు
హెచ్1బీ జీవిత భాగస్వాముల్ని ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని సెనెటర్ కమలా హారిస్ సహా పలువురు చట్టసభ్యులు, సిలికాన్ వ్యాలీ కంపెనీలు ట్రంప్‌ను కోరుతున్నాయి. లేదంటే నిపుణులను కోల్పోతామని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ అమెరికా’ సంస్థ వాషింగ్టన్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ వేసింది. కాగా, ఇటీవల అమెరికా పాక్షిక షట్‌డౌన్ నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రక్రియను కోర్టు నెల పాటు వాయిదా వేసింది. తాజాగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోర్టుకు తెలపనుంది. ప్రస్తుతం అమెరికాలో 4,19,637 మంది విదేశీ నిపుణులు హెచ్1బీ వీసాపై పనిచేస్తుండగా, వీరిలో 3,09,986 మంది భారతీయులే.
Comments
Please login to add a commentAdd a comment