హెచ్–1బీ వీసాదారుల కుటుంబాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పిడుగు వేయనున్నారు. సాధారణంగా హెచ్–1బీ వీసా ఉన్నవారు పెళ్లయ్యాక జీవిత భాగస్వామిని హెచ్–4 వీసాపై అమెరికా తీసుకెళ్తారు. హెచ్–4 వీసా ఉన్నవారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా అనుమతులిచ్చారు. తాజాగా ఆ అనుమతులను రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా హోంల్యాండ్ శాఖ ప్రకటించింది. ఒకవేళ ఈ అనుమతులు రద్దయితే భారతీయులు సహా దాదాపు లక్ష మంది అమెరికాలో ఉద్యోగాలు మానుకుని మళ్లీ ఇళ్లలో కూర్చోవాల్సి ఉంటుంది. సొంతంగా సంపాదించుకోగలిగిన ప్రతిభ ఉన్నప్పటికీ వారంతా తమ భర్తలు/భార్యల సంపాదన మీదే ఆధారపడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్–4 వీసాపై పనిచేస్తున్న భారతీయులు దాదాపు 70 వేల మంది ఉంటారనీ, వారిలోనూ 90 శాతం భార్యలేనని ఓ అంచనా.
నాడు సానుకూలంగా స్పందించిన ఒబామా
‘హెచ్–1బీ వీసా కలిగిన తమ జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు సొంత దేశాన్ని వదిలి హెచ్–4 వీసాపై అమెరికా వచ్చేవారిలో ఎక్కువ మంది విద్యావంతులు, తగిన ప్రతిభ ఉన్నవారే. వీరంతా ఇళ్లకు ఎందుకు పరిమితం కావాలి? వీరికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. వీరినీ పనిచేసేందుకు అనుమతించాలి’ అని డిమాండ్లు రావడంతో హెచ్–4 వీసాపై వచ్చినవారు 2015 మే 26 నుంచి అమెరికాలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఒబామాæ సర్కారు ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు వరకు హెచ్–1బీ వీసా ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా కంపెనీల్లో పనిచేయాలంటే తమ భార్యలు/భర్తలకు గ్రీన్‌కార్డ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది.
ఇప్పటికే లక్ష మందికి అనుమతులు
2015 జూన్–2017 జూన్ మధ్య వివిధ దేశాలకు చెందిన 1,04,748 మంది హెచ్–4 వీసాదారులు ఉద్యోగం చేసేందుకు అనుమతులు పొందారు. 2015లో 26,856 మంది, 2016లో 41,526 మంది 2017 జూన్ వరకు 36, 366 మంది హెచ్–4 వీసాదారులకు ఉద్యోగం చేసే అనుమతులు లభించాయి. ఇప్పుడు ట్రంప్ యంత్రాంగం హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు నిలిపేస్తే వీరందరూ కొలువులు కోల్పోతారు. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునే వారికీ ఇబ్బందే. కొన్ని కుటుంబాల్లో పిల్లలు అమెరికాలోనే పుట్టి వారికి అమెరికా పౌరసత్వమే సంక్రమించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పిల్లలు కలిగిన హెచ్–4 వీసాదారులను పనిచేసేందుకు అనుమతించకపోవడం అన్యాయమేనని ఓ వాదన.
ఎన్నికల హామీలో భాగమే!
అమెరికా జాతీయుల ఉద్యోగాలను ఇతర దేశాల వారు కొల్లగొడుతున్నారనీ, తాను గెలిస్తే దీనిని కట్టడి చేస్తానన్నది ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ. హెచ్–1బీ సహా పలు వర్క్ వీసాల విధానాలను సమీక్షించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంది. హెచ్–4 వీసా కలిగిన వారికి పనిచేసేందుకు ఉన్న అనుమతులను రద్దు చేసే ప్రతిపాదనను మొదట ఈ ఏప్రిల్‌లోనే ప్రభుత్వం తెచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చొచ్చు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
‘హెచ్–1బీ’పై ట్రంప్ మరో పిడుగు!
Published Sun, Dec 17 2017 2:07 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment