కొడుకు మ్యారేజ్‌డేకి వెళ్లొస్తూ తల్లి దుర్మరణం
గొడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం
నక్కపల్లి : మ్యారేజిడే వేడుకకు వెళ్లి వస్తుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా ఏడుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ రేసపువానిపాలెంలో ఏయూ రిటైర్డు ప్రొఫెసర్ దాసరి ప్రభాకర్‌రావు కుటుంబం నివసిస్తోంది . ఈయన భార్య అమ్మాజీ(60) కూడా బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. వీరి ఏకైక కుమారుడు సందీప్ కాకినాడలో రిలయన్స్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సందీప్ పెళ్లి రోజు. దీంతో కుమారుడి పెళ్లిరోజు వేడుకకు హాజరయ్యేందుకు ప్రభాకరరావు కుటుంబ సభ్యులు కాకినాడ వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక సోమవారం వీరంతా తిరుగుప్రయాణమయ్యారు.
కొడుకు సందీప్ కారులో వీరంతా విశాఖ బయలుదేరారు. రాత్రి 8గంటలప్రాంతంలో కారు మండలంలోని గొడిచర్లసమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అడ్డొచ్చింది. దీన్ని తప్పించే ప్రయత్నంలో కారు పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీలుకొట్టింది. ఈ ఘటనలో సందీప్ తల్లి అమ్మాజీ అక్కడికక్కడే మరణించారు. ప్రభాకర్‌రావుకు కాలు విరిగిపోయింది. తలకు బలమైన గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న సందీప్ కాలు కూడా విరిగిపోయింది. నడుంకు బలమైన గాయమైంది. మేనకోడలు తేజస్విని తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది.
చంద్రిక, సంధ్యలతోపాటు రెండేళ్ల చిన్నారి ప్రణవి కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులను విశాఖ దిగబెడదామని బయలుదేరానని ఇంతలో ప్రమాదం సంభవించిందని సందీప్ సాక్షికి తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో తుని ఏరియా ఆస్పత్రి మారుమోగింది. తునిలో ఉన్న సందీప్ బంధువులు ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి బాధితులకు సపర్యలు చేశారు. ఏరియా ఆస్పత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తరలించారు.