హన్వాడ/నవాబ్‌పేట/మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: వేట కోసం వచ్చి దారితప్పిన ఓ చిరుతపులి వలలో చిక్కింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున స్థానిక రైతుల ద్వారా వెలుగుచూసింది. నవాబ్‌పేట మండలం మైసమ్మ అటవీప్రాంతం, హన్వాడ మండలం గుడిమల్కాపూర్ , రంగారెడ్డి జిల్లా సాకలిపల్లి అటవీప్రాంతంలో గతకొద్దిరోజులుగా చిరుత సంచరిస్తోంది.
ఇదిలాఉండగా, పరిసర గ్రామాల్లో అడవిపందులు సంచరిస్తూ..వేరుశనగ పంటను నాశనం చేస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాటిబారినుంచి పంటను ఎలాగైనా కాపాడుకోవాలని స్థానిక రైతులు సాకలిపల్లి శివారులో వలను అమర్చారు. అటుగా వచ్చిన చిరుత వలలో చిక్కి కదల్లేనిస్థితిలో ఉండిపోయింది. చిరుత గాండ్రింపులు విని రైతులు భయబ్రాంతులకు గురైయ్యారు.
ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పట్టుకునేందుకు విఫలయత్నం చేశా రు. హైదరాబాద్‌లోని జూపార్కుకు చెందిన రెస్క్యూటీంకు సమాచారమందించడంతో వారు రంగంలోకి దిగారు. గ్రామస్తుల సహాయంతో వారు గాయపడిన చిరుతకు మత్తు ఇం జక్షన్ ఇచ్చి బోనులో బంధించి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. చిరుతకు జూపార్కుకు చెందిన జంతువైద్యులు డాక్టర్ ఎండీ హాకీం వైద్యచికిత్సలు అందించారు. గాయపడిన చిరుతను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పరి శీలించారు.
వెంటనే దానిని జూకు తరలించేందుకు ఏర్పాట్లు చేయలని అధికారులకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతాల్లో పులి, చిరుత వంటి జంతువుల సంచరిస్తున్నట్లు తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు. సంఘటనకు బాధ్యుడైన రైతుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ నారేందర్‌రెడ్డి తెలిపారు. కాగ పంటను కాపాడుకునే ప్రయత్నంలో వన్యప్రాణులను చంపేందుకు వేస్తున్న కంచెల వల్ల వాటి ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. అనంతరం చిరుతను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.
దారితప్పి..వలకు చిక్కి
Published Thu, Jan 16 2014 5:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement