గడువు ముగుస్తోంది..!
వర్షాభావ పరిస్థితులు రైతన్నను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సాగుచేసిన పంట దక్కుతుందో లేదోననే ఆందోళన మొదలైంది.. ఈ పరిస్థితుల్లో రైతులకు కాసింత ధైర్యం కల్పించే పం టల బీమా పథకం అమలుకు అడుగుముందుకు పడటం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలు అందకపోవడంతో రైతులకు ఏమీ చెప్పలేకపోతున్నారు.
మహబూబ్‌నగర్ వ్యవసాయం : వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటలు నష్టపోయిన సమయంలో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకాన్ని (ఎన్‌ఏఐఎస్) అమలుచేస్తోంది. రైతులు తమ పంటలపై బీ మా ప్రీమియం చెల్లిస్తే పంటనష్టపోయి న సందర్భంలో నష్టపరిహారం పొందుతారు. ఈ పథకం అమలు బాధ్యతను ప్రభుత్వం గతేడాది ఓరియంటల్ బీమా కంపెనీకి అప్పగించింది. ఏటా ఖరీఫ్‌లో ఏప్రిల్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు బీమా ప్రీమియం చెల్లిస్తారు. బ్యాంకుల ద్వారా రుణంపొందే రైతులకు సంబంధించిన ఆయా బ్యాం కులే చెల్లిస్తాయి. జిల్లాలో పత్తి పంటను వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తిం చింది. ఈ పంటకు ఈనెల 31వ తేదీలోగా ఎకరాకు రూ.600 చొప్పున ప్రీమియం చెల్లించాలి. చెల్లింపునకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో ఎలాంటి విధివిధానాలు ఖరారు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెగుళ్ల బారిన పంటలు
ఈసారి పత్తి రైతులకు నిరాశే మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు జిల్లాలో కల్వకుర్తి, వంగూరు, మాడ్గుల, అచ్చంపేట, ఉప్పునుంతల, నాగర్‌కర్నూల్, తాడూరు, తెల్కపల్లి, కొల్లాపూర్ ప్రాంతంలో అధిక విస్తీర్ణం లో పత్తిపంటను సాగుచేశారు. మొక్క లు ఎదిగే సమయంలో ఎర్రగుమ్మడి విజృంభించింది. మందులు పిచికారీ చేసినా పంట ఎదుగుదల కనిపించడం లేదు. అలాగే మక్తల్ ప్రాంతంలోని మాగనూరు, మక్తల్ ప్రాంతంలో పెసర పంటను పచ్చతెగులు చుట్టుముట్టింది. పంట చేతికొచ్చే ఆశలేదని రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో పంట బీమా పనికొచ్చేదని వారు అభిప్రాయపడుతున్నారు.
అయోమయంలో రైతులు
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7.28 లక్షల హెకార్లు కాగా, వర్షాలు ఆలస్యం గా కురియడంతో ఇంతవరకు 4.15 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ పంట లు సాగుచేశారు. వరి 6,500 హెక్టార్లలో, జొన్న 8,500, మొక్కజొన్న 95 వేల హెక్టార్లలో , ఆముదం 38,126, పత్తి 1.22 లక్షల హెక్టార్లలో, కంది 36 వేల హెక్టార్లలో సాగయ్యాయి. వరుణుడు కరుణిస్తే మరో రెండు లక్షల హెక్టార్ల మేర పంటలు సాగయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, పత్తి పంటకు ఈనెల 31తో బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగించనుంది. కాగా, బీమా ప్రీమియాన్ని చెల్లించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నా.. ఎలాంటి మార్గదర్శకాలు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రీమియం చెల్లింపునకు మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు చెల్లింపు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు.