‘రుణం’.. రణం | 'Debt' .. compartment | Sakshi
Sakshi News home page

‘రుణం’.. రణం

Published Mon, Jul 14 2014 3:24 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

‘రుణం’.. రణం - Sakshi

‘రుణం’.. రణం

 మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆలస్యంగా వరుణుడు కరుణించాడనే ఊరట ఓ వైపున్నా పెట్టుబడి దొరికే మార్గం లేదనే నిస్సహాయత రైతాంగంలో కనిపిస్తోంది. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రుణమాఫీపై స్పష్టత వస్తే తప్ప రైతుకు ఊరట లభించేలా లేదు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 7.06 లక్షల హెక్టార్లు కాగా గత యేడాది 7.78లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఈ యేడాది ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. జూన్ నెలాఖరు నాటికి కేవలం 74వేల హెక్టార్లలో రైతులు సాగు చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 3.21 లక్షలకు చేరింది. ఇందులో వర్షాధారంగానే 3.03లక్షల హెక్టార్లు పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడిస్తోంది. వర్షాధారంగా వేసిన పంటల్లో కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న వంటి పంటలే ఎక్కువ సాగయ్యాయి. ఖరీఫ్ ఆరంభంలోనే విత్తనాలు వేసినా వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే నష్టపోయిన రైతులు మరోమారు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
 
 ఒక్కసారిగా వ్యవసాయ పనులు ఊ పందుకోవడంతో రైతులు పెట్టుబడి కోసం ప రుగులు తీస్తున్నారు. రుణమాఫీపై విధి విధానాలు ఖరారు కాకపోవడంతో బ్యాంకు మెట్లెక్కేందుకు రైతులు వెనుకాడుతున్నారు. మాఫీ పై ఆశతో గతంలో తీసుకున్న రుణాలను రైతు లు చెల్లించక పోవడంతో కొత్తగా రుణాలు మం జూరు చేసేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నా రు. గతంలో రుణం చెల్లించిన వారికి మాత్రమే తిరిగి మంజూరు చేస్తామని బ్యాంకర్లు తెగేసి చె బుతున్నారు. దీంతో పెట్టుబడి కోసం రైతులు ప్రైవేటు వ్యక్తులపై ఆధార పడాల్సి రావడంతో అధిక వడ్డీలు డిమాండు చే స్తున్నారు.
 
 పట్టాలెక్కని రుణ ప్రణాళిక
 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.5031 కోట్లతో ఖరారు చేసి ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో పంట రుణాల మొత్తాన్ని రూ.2803 కోట్లుగా నిర్ణయించి ఖరీఫ్‌లో రూ.1962కోట్లు, రబీలో రూ.841 కోట్లు వితరణ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
 
 అయితే రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో ఖరీఫ్ రుణ వితరణ లక్ష్యంలో రూ.200 కోట్ల మేర మాత్రమే రైతులకు మంజూరు చేశారు. పంటరుణ మాఫీపై స్పష్టత రానందున పరోక్షంగా రైతులను ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాలు, టర్మ్ లోన్స్ తదితరాల రూపంలో ఇచ్చే రుణం పెట్టుబడిగా వాడుకోండని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఒక్కో బ్యాంకు శాఖ పరిధిలో 100 నుంచి 150 మంది కొత్త రైతులకు రుణం ఇస్తామని అధికారులు ప్రకటించినా బ్యాంకర్లు మాత్రం సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు.
 
 నెలరోజులైనాక రమ్మంటుండ్రు
 కొడుకులకు పంచింది పోను నాకు రెండెకరాల భూమి ఉంది. ఏటా వరిపంట వేసి బతుకుతున్నాం. ఇంతవరకు ఎప్పుడూ బ్యాంకు లోను తీసుకోలే. పోయినేడు పంటలు సరిగా పండక నష్టం వచ్చింది. ఈ ఏడు మళ్లీ వరి నాటుదామని రెండు ప్యాకెట్ల వడ్లు కొన్నా. పాస్‌బుక్కులు తీసుకుని కొల్లాపూర్‌లో బ్యాంకుకు పోతే రుణాలు మాఫీగాలే, నెలరోజులైనాక రండని బ్యాంకోళ్లు చెప్తున్నరు. నాటేందుకు పైసల కోసం అప్పులు చేయలేక రోజూ కూలి పనులకు పోతున్నం.
 - ఇటికల బిచ్చన్న,
 రైతు, మాచినేనిపల్లి
 
 ఆరువేలిచ్చి కౌలు చేస్తున్నా
 నాలుగెకరాల్ల వేరుశనగ పంట వేసిన. మూడెకరాలను ఆరువేలకు కౌలుకు తీసుకుని నెలకిందట మొక్కజొన్న వేస్తే వానలు రాక మొలవలే. పోయినేడు బ్యాంకులో రూ.12వేలు ఉంటే రూ.20వేలకు రెన్యూవల్ చేసుకున్న. పో యినేడు నాలుగెకరాల్లో ఆరుకింటాళ్ల విత్తులు వేస్తే నాలుగు క్వింటాళ్లు చేతికొచ్చాయి. గవర్నమెంట్ వాళ్లు పాత రుణాలు మాఫీ చేస్తామన్నరు. బ్యాంకు వాళ్లు ఇంకా రుణలు మాఫీ కాలేదు.. అవి మాఫీ అయితేనే కొత్తవి ఇస్తామంటున్నారు. పిండి సంచులు, కూలీల కోసం 15వేలు ఊళ్లోనే అప్పు తీసుకున్నా.
 - చిన్న వెంకటయ్య,
 రైతు, తాళ్ల నర్సింహాపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement