రబీ.. ఢమాల్
మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లాలో రబీ సాగు అమాంతంగా పడిపోయింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడు సగం విస్తీర్ణంలో కూడా పంట లను రైతులు సాగు చేసుకోలేకపోయారు. వాతావరణ ప్రతి కూల పరిస్థితులు, విద్యుత్ సమస్యలు, వర్షభావ పరి స్థితులు, భూగర్భజలాలు అధాపాతాళానికి పడిపోవడం వంటి కారణాలతో రబీసాగు తగ్గుముఖం పట్టాయని అధికారులు భావిస్తున్నారు.
జిల్లా సాధారణ సాగు 2.09లక్షల హెక్టార్లు కాగా గతేడాది రబీలో 2.56లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. కాగా ఈ ఏడాది రబీలో ఇప్పటివరకు 1.20 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యా యి. ఖరీఫ్‌లో పంటలు సాగుచేసి నష్టాల పాలైన రైతులు ఈ సారి రబీలో పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా రైతులు రబీ సాగుకు దూరమవుతున్నారు.
వరి పంటే కీలకం...
జిల్లా పంటల సాధారణ సాగు 2.09లక్షల హెక్టార్లు కాగా అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 51వేల హెక్టార్లు. గత ఏడాది 82వేల హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు కేవలం 7,877 హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు.ప్రభుత్వం రబీ సీజన్ ప్రారంభం నుండి రబీలో వరి పంటను సాగుచేయవద్దని చెబుతూ వస్తోంది. వేసవికాలంలో విద్యుత్ సమస్య తలెత్త్తే ప్రమాదం ఉండడంతో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటివి సాగు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ పథకాల నుంచి వరి విత్తనాలపై ఇచ్చే సబ్సిడీకి పూర్తిగా కోత విధించింది.
ఈ సారి సీడ్‌విలేజ్ ప్రోగ్రాం, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం, ఎన్‌ఎస్‌పీ కింద వరి విత్తనాలకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేసి సబ్సిడీవిత్తనాల పంపిణీని ఆపేసింది. వేసవిలో విద్యుత్ సమస్య అధికమౌతుందనే ఉద్దేశంతో రైతులు ఆందోళన చెందుతూ వరి పంటను సాగు చేయడం మానుకుంటున్నారు. దీంతో వరి సాగు ఈ సారి భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో గతేడాది 1.26లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగవ్వగా ఈ ఏడాది 73వేల హెక్టార్లలో మాత్రమే సాగైయ్యింది. ఈ ఏడాది సకాలంలో స్ప్రింక్లర్ల పంపిణీ చేయకపోవడం, భూగర్బజలాలు తగ్గడం వంటి కారణాలతో రైతులు వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఖరీఫ్‌లో నష్టలపాలు అవడంతో పెట్టుబడులు దొరక్క.. బ్యాంకుల్లోనూ ఆ సమయానికి అందక ఈసారి రైతులు వేరుశనగ పంట సాగుకు దూరమయ్యారని చెప్పవచ్చు. ఇలా జిల్లాలో రబీ సాగు నత్తనడకలా సాగుతోంది.