అమరావతికి అగ్రస్థానం
సాంస్కృతిక, పర్యాటకంలో వారసత్వ సంపదగా ఎంపిక
దేశంలోని 12 ప్రాంతాల్లో అమరాతికి ప్రత్యేక స్థానం
రూ.25కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు
చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్లు.. చల్లటి పిల్లగాలులు.. కనువిందు చేసే కృష్ణమ్మ పరవళ్లు.. చరిత్ర చెప్పే ఆనవాళ్లు.. అడుగడుగునా ఆధ్యాత్మిక సిరులు అమరావతికే సొంతమైన ఆభరణాలు. హిందువులకే కాకుండా బౌద్ధులు, జైనులకూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఈ పట్టణానికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్రప్రభుత్వ సంస్కృతి, పర్యాటక రంగంలో 12 వారసత్వ నగరాలను ఎంపికచేయగా, అందులో అమరావతికి కూడా స్థానం లభించింది. దీనిద్వారా విడుదలయ్యే రూ.25 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
- అరండల్‌పేట/అమరావతి
ఘనచరిత్ర
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం.. మౌర్య వంశస్తుడైన అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధ భిక్షువులు ధర్మ ప్రచార నిమిత్తం అమరావతికి వచ్చారు. అప్పుడే ఇక్కడ బౌద్ధమత విస్తరణ జరిగింది. అలాగే, మహదేవభిక్షువు సంఘ రక్షితుడు ఒకరు శ్రీలంక దేశానికి వెళుతూ అమరావతిని సందర్శించి, మహాస్తూప నిర్మాణానికి అంకురార్పణ చేశారు. నాటి నుంచి ఉత్తర భారతదేశానికి, అమరావతికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో శాతవాహన చక్రవర్తులు అమరావతిని రాజధానిగా చేసుకుని తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు. వీరి కాలంలో రోమ్ దేశస్తులు వర్తక, వాణిజ్యాలు ఈ ప్రాంతంలోనే నిర్వహించటంతో ఇరుప్రాంతాల వారు పరస్పర సంస్కృతీ సంప్రదాయూలపై అవగాహన ఏర్పరచుకునే అవకాశం కలిగింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దంలో ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీ ధాన్యకటకం (ధరణికోట)పై మక్కువతో సంవత్సరంపాటు ఇక్కడే నివసించి మహాస్తూపం వైభవాన్ని, ఆనాటి ఆహారపు అలవాట్లు, ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, జీవనవిధానాన్ని తన గ్రంథంలో పొందుపరిచారు. తద్వారా చైనా దేశస్తులకు అమరావతి క్షేత్రం దగ్గరైంది.
క్రీ.శ. 18వ శతాబ్దంలో బ్రిటీష్ జాతీయుడైన కల్నల్ కొలెన్ మెకంజీ అమరావతి పట్టణాన్ని సందర్శించి, మహాస్థూపం చరిత్రను తెలుసుకున్నారు. తన రచనల ద్వారా బ్రిటీష్ వారికి మహాస్థూప ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఇటీవల 2006 జనవ రిలో బౌద్ధగురువు దలైలామా ఆధ్వర్యంలో నిర్వహించిన కాలచక్ర మహోత్సవాలకు టిబెట్, భూటాన్, జపాన్, శ్రీలంక దేశాలతోపాటు యూరప్ దేశాల నుంచి వచ్చిన సుమారు రెండు లక్షల మంది యాత్రికులు అమరావతిని సందర్శించారు. నేటికీ ఎంతోమంది యాత్రికులు అమరావతిని సందర్శిస్తూనే ఉన్నారు.