
చిత్రంలో డాక్టర్ కొంగర రవికాంత్, 29 కిలోలబరువుతో బాధపడుతున్న బాలిక, తల్లిదండ్రులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): లెప్టిన్ హార్మోన్ లోపం కారణంగా పాలు తాగే ప్రాయంలోనే బిడ్డ బరువు విపరీతంగా పెరిగిపోయింది. వయస్సు 18 నెలలు వచ్చే సరికి 29 కేజీలకు చేరడంతో శ్యాస తీసుకోవడమే కష్టంగా మారింది. అటువంటి దయనీయ స్థితిలో అమృత్‌సర్‌కు చెందిన దంపతులు రాష్ట్రాలు దాటి చికిత్స కోసం కూతురు చాహత్‌ను తీసుకుని విజయవాడకు వచ్చారు. గతంలో అనేక సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కొంగర రవికాంత్‌ను సంప్రదించగా, బేరియాట్రిక్ సర్జరీ చేసేందుకు ముందుకొచ్చారు. తన వంతుగా కొన్ని సేవలు ఉచితంగా చేసినా, మందులు, ఇతరత్రా ఖర్చులు సైతం లేకపోవడంతో దాతల నుంచి సహాయం అర్థిస్తున్నారు ఆ నిరుపేద దంపతులు.
ప్రస్తుతం పాప చికిత్స పొందుతున్న డోర్నకల్ రోడ్డులోని ఎండోకేర్ ఆస్పత్రిలో శుక్రవారం చాహత్ తండ్రి సూరజ్‌కుమార్ మాట్లాడుతూ తాను అమృత్‌సర్‌లో కేబుల్ మెకానిక్‌గా పనిచేస్తుంటానని తెలిపారు. తొలికాన్పులో నెలరోజులకే మొదటి బిడ్డను పోగొట్టుకున్నామని, రెండో బిడ్డ బరువు రోజురోజుకు పెరుగుతుంటే వైద్యం కోసం యూ ట్యూబ్‌లో సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. నెల రోజుల కిందట ఆస్పత్రికి రాగా ఇప్పటివరకూ వైద్యులు ఉచితంగా చికిత్స చేశారని చెప్పారు. సర్జరీ ఇతరత్రా ఖర్చులు రూ.4 లక్షల వరకూ అవుతాయని చెప్పినట్టు తెలిపారు. దాతలు దయతలచి సాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సాయం అందించే వారు 98880 84583ను సంప్రదించి హిందీలో మాట్లాడాలని ఆయన కోరారు. నెల రోజులుగా ఆహార నియమాలు పాటించినా బరువు తగ్గకపోవడంతో బేరియాట్రిక్ చికిత్స చేయాలని నిర్ణయించినట్టు డాక్టర్ కొంగర రవికాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment