31వ తేదీ వరకు రైతులకు అవకాశం
కలెక్టరేట్‌తోపాటు అన్ని ఆర్డీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ
మచిలీపట్నం : రుణమాఫీ పథకం లబ్ధిపొందని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ప్రకటించారు. వాస్తవానికి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రుణమాఫీ దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం కూడా ఈ కేంద్రం కొనసాగనుంది. రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువును పెంచుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కలెక్టరేట్‌తోపాటు, జిల్లాలోని నాలుగు ఆర్డీవో కార్యాలయాల్లోనూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వ్యవసాయశాఖ డీడీ బాలునాయక్ ‘సాక్షి’కి తెలిపారు.
గడువు పొడిగింపు రెండోసారి
ఏప్రిల్ 27వ తేదీన కలెక్టరేట్‌లో రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. మే 15వ తేదీ వరకు గడువు విధిం చారు. రైతుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో ఈ నెల 25వ తేదీ వరకు ఈ గడువు పొడిగించారు. ఈ గడువు సోమవారంతో ముగియనుంది. ఈలోగానే వ్యవసాయశాఖ మంత్రి ఈ నెల 31వ తేదీ వరకు ఈ గడువును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రానికి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
రోజుకు 900 చొప్పున దరఖాస్తులు స్వీకరించారు. రూ.50 వేలకు మించి రూ.1.50 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిలో మొదటి వాయిదాగా రూ.30 వేలు మాత్రమే జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించని రైతులు తాము తీసుకున్న రుణం మొత్తం మాఫీ కాలేదని ఫిర్యాదుల కేంద్రానికి వచ్చారు. కొంత మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. మీ-సేవ కేంద్రంలో తీసుకున్న పత్రంలో డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో కొంత మంది రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది. డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో ఉన్న ఫిర్యాదులను అధికారులు స్వీకరించలేదు. ఈ తరహాలో 2,300లకు పైగా ఫిర్యాదులను అధికారులు తిరస్కరించారు.
పూర్తి వివరాల నమోదు
రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో తీసుకున్న దరఖాస్తులను ఎనిమిది బృందాల అధికారులు స్వీకరించారు. అధికారులు స్వీకరించిన రుణమాఫీ ఫిర్యాదుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన నమూనా ఆధారంగా నింపి వివరాలను హైదరాబాద్‌కు పంపారు. రైతు పేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత మేర రుణమాఫీ జరిగింది, రిమార్కులో ఏం రాసి ఉంది తదితర వివరాలను నమోదు చేశారు. ఇందుకోసం 15 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా హైదరాబాద్‌లోని ప్రణాళికా విభాగానికి పంపుతున్నారు. సోమవారం ఆఖరు రోజు కావడంతో అధికంగా దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మీ-కోసం కార్యక్రమాన్ని రద్దు చేసినప్పటికీ రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణను కొనసాగిస్తున్నారు.
రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంపు
Published Mon, May 25 2015 5:16 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM
Advertisement