- రెండు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
- జీవన సంధ్యలో పోరాటం
సాక్షి కడప : చేతిలో కట్టె ఉంటే కాని కాలు కదప లేదు. నోటిలో పళ్లన్నీ ఊడిపోవడంతో మాట సరిగా రాదు. పైగా వినికిడి సమస్య. అలాంటి కె.బాలసుబ్బమ్మ(92) అనే వృద్ధురాలి వేలి ముద్రలు సరిపోలలేదని రెండు నెలలుగా రేషన్ బియ్యం నిలిపి వేశారు. కడప నగరంలో ఒంటరిగా జీవిస్తున్న ఆ అవ్వ దయనీయ స్థితి చూసిన వారి కంట నీరు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కడప కార్పొరేషన్ పరిధిలోని శంకరాపురం ప్రాంతానికి చెందిన కె.బాల సుబ్బమ్మ భర్త పెద్ద గంగిశెట్టి ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు రేషన్ కార్డు ఉంది.
ప్రతి నెలా బియ్యం తెచ్చుకుని వండుకుని తినేది. వేలి ముద్రలు సరిపోలలేదనే కారణంతో రెండు నెలలుగా ఆమెకు బియ్యం ఇవ్వడం లేదు. ‘రేషన్ షాపు వద్దకు పోతే పేరు లేదని సెప్పినారు. అధికారులను కలిస్తే వేలి ముద్రలు సరిపోలేదన్నారు. పలుమార్లు వేలి ముద్రలు తీసుకున్నారు.. అయినా బియ్యం ఇవ్వడం లేదు.. ఏం సేయాలో అర్థం కాలా.. ఇదో ఇలా పడుతూ లేత్తూ పెద్ద సారోల్ల సుట్టూరా తిరుగుతున్నా.. ఉన్నోళ్లం అయితే ఇలా తిరిగేదాన్నా.. పేదరాల్ని కాబట్టే ఈ ఖర్మపట్టింది.. ఈ కలెక్టర్ ఆఫీసుకు ఇప్పటికి నాలుగు సార్లు వచ్చినా.. ఆటోలకు డబ్బులయిపోతున్నాయి కానీ ఎవరూ పట్టించుకోరు.. ముసలిదాన్ని.. తిరగలేకపోతున్నా..’ అంటూ బుధవారం కలెక్టరేట్ వద్ద వాపోయింది. తన సమస్య పరిష్కరించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కెవి రమణకు సైతం వినతి పత్రం అందజేసింది. ఆయన డీఎస్‌ఓకు రెఫర్ చేశారు కానీ సమస్య పరిష్కారం కాలేదు.