ration items
-
70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సాక్షి, సిద్దిపేట : లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదేవ్‌పూర్ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గోధుమపిండికి ఎగనామం
అనంతపురం అర్బన్ : జిల్లాలో తెల్లకార్డుదారులకు ఈ నెల కోటా గోధుమపిండి పంపిణీ చేయలేదు. జిల్లావ్యాప్తంగా 11.92 లక్షల తెల్లకార్డుదారులు ఉండగా, ఇందులో 1.31 లక్షల మంది ముస్లిం కార్డుదారులు ఉన్నట్లు అంచనా. ముస్లిం లబ్ధిదారులకు రంజాన్ తోఫా ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా అందజేస్తున్న ఐదు కేజీల గోధుమ పిండిని అదనంగా తెప్పించలేదు. తెల్లకార్డుదారులకు నెలవారీగా ఇచ్చే కేజీ గోధుమపిండిని అటు మళ్లించింది. వారికి కూడా తోఫా కింద ఇచ్చే గోధుమపిండి తప్ప నెలవారీగా రావాల్సింది ఇవ్వలేదు. అంత్యోదయ కార్డుదారులకు మాత్రం ఒక కిలో చొప్పున చక్కెర ఇచ్చినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డి.శివశంకర్‌రెడ్డి తెలిపారు. -
180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయగూడెంలో పౌరసరఫరాల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయనే సమాచారంతో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
25.2 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం: నగరంలో పలుచోట్ల గురువారం సివిల్ సప్లయ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 25.2 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నవీపేట(నిజామాబాద్): అక్రమంగా తరలిస్తున్న 100 క్విటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం నుంచి ఓ డీసీఎంలో రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో రెవన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సరైన సమయంలో దాడి చేసి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రేషన్ సరుకుల స్వాధీనం
సత్తుపల్లి(ఖమ్మం): రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పౌర సరఫరా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 క్వింటాళ్ల బియ్యం, 1.40 క్వింటాళ్ల కందిపప్పు, ఒక క్వింటాల్ పంచదారను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పౌరసరఫరాల అధికారి డీటీ జగదీశ్ దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. -
పెద్ద ఎత్తున రేషన్ సరుకుల పట్టివేత
పహాడీషరీఫ్: రేషన్ బియ్యాన్ని నల్లబజార్‌కు తరలించేందుకు నిల్వ ఉంచిన గోదాముపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇసామియా బజార్‌కు చెందిన శంకర్ లాల్ అనే వ్యక్తి సరూర్‌నగర్ మండలం కొత్తపేట పంచాయతీ ఫాతిమానగర్‌లో ఓ గోదాము తీసుకొని రేషన్ సరుకులను నిల్వ ఉంచుతున్నాడు. బాలాపూర్‌కు చెందిన మధు కిరణ్, రాంబాగ్‌కు చెందిన రాజు కమల్ అనే వారు నగరంలోని వివిధ రేషన్ దుకాణాల నుంచి సరుకులు తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో పాటు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంటారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు నర్సింగ్‌రావు, రంగ స్వామి, ఎస్సైలు ఆంజనేయులు, రమేష్ బుధవారం సాయంత్రం ఆ గోదాముపై దాడులు చేశారు. ఈ దాడులలో శంకర్ లాల్, మధుకిరణ్, రాజు కమల్‌తో పాటు డీసీఎం డ్రైవర్ గఫార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు గోదాములో నిల్వ ఉంచిన 228 క్వింటాళ్ల బియ్యం, 21 క్వింటాళ్ల చక్కెర, 17.5 క్వింటాళ్ల గోధుమలు, మూడున్నర క్వింటాళ్ల కందిపప్పు, రెండు క్వింటాళ్ల ఉప్పు, రూ. లక్ష నగదు, నాలుగు సెల్ఫోన్లు, డీసీఎం, స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు. -
వేలిముద్రలు సరిగాలేవని.. రేషన్ ఇవ్వలేదు
రెండు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు జీవన సంధ్యలో పోరాటం సాక్షి కడప : చేతిలో కట్టె ఉంటే కాని కాలు కదప లేదు. నోటిలో పళ్లన్నీ ఊడిపోవడంతో మాట సరిగా రాదు. పైగా వినికిడి సమస్య. అలాంటి కె.బాలసుబ్బమ్మ(92) అనే వృద్ధురాలి వేలి ముద్రలు సరిపోలలేదని రెండు నెలలుగా రేషన్ బియ్యం నిలిపి వేశారు. కడప నగరంలో ఒంటరిగా జీవిస్తున్న ఆ అవ్వ దయనీయ స్థితి చూసిన వారి కంట నీరు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కడప కార్పొరేషన్ పరిధిలోని శంకరాపురం ప్రాంతానికి చెందిన కె.బాల సుబ్బమ్మ భర్త పెద్ద గంగిశెట్టి ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు రేషన్ కార్డు ఉంది. ప్రతి నెలా బియ్యం తెచ్చుకుని వండుకుని తినేది. వేలి ముద్రలు సరిపోలలేదనే కారణంతో రెండు నెలలుగా ఆమెకు బియ్యం ఇవ్వడం లేదు. ‘రేషన్ షాపు వద్దకు పోతే పేరు లేదని సెప్పినారు. అధికారులను కలిస్తే వేలి ముద్రలు సరిపోలేదన్నారు. పలుమార్లు వేలి ముద్రలు తీసుకున్నారు.. అయినా బియ్యం ఇవ్వడం లేదు.. ఏం సేయాలో అర్థం కాలా.. ఇదో ఇలా పడుతూ లేత్తూ పెద్ద సారోల్ల సుట్టూరా తిరుగుతున్నా.. ఉన్నోళ్లం అయితే ఇలా తిరిగేదాన్నా.. పేదరాల్ని కాబట్టే ఈ ఖర్మపట్టింది.. ఈ కలెక్టర్ ఆఫీసుకు ఇప్పటికి నాలుగు సార్లు వచ్చినా.. ఆటోలకు డబ్బులయిపోతున్నాయి కానీ ఎవరూ పట్టించుకోరు.. ముసలిదాన్ని.. తిరగలేకపోతున్నా..’ అంటూ బుధవారం కలెక్టరేట్ వద్ద వాపోయింది. తన సమస్య పరిష్కరించాలంటూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కెవి రమణకు సైతం వినతి పత్రం అందజేసింది. ఆయన డీఎస్ఓకు రెఫర్ చేశారు కానీ సమస్య పరిష్కారం కాలేదు. -
పండుగ పూటా పస్తులే..!
* ఇంతవరకూ అందని చక్కెర * బియ్యం.. పప్పు.. ఉప్పూ కరువే * ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్ * సర్కార్ తీరుపై పేదల ఆక్రోశం సంగారెడ్డి: తెలంగాణలో పండుగరోజు పప్పన్నం తినటం కాదు, పాయసం తాగుదాం...పండుగకు వారం రోజుల ముందే పేదలకు అవసరమైన పండుగ సామాను అందజేస్తాం. - సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. కానీ సీఎం మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తెలుగువారు చేసుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పెద్దోళ్లు..పేదోళ్లు అన్న తేడా లేకుండా పండుగపూట పిండి వంటలు చేసుకుని కుటుంబసభ్యులంతా సంతోషంగా తింటారు. అయితే ఈ సంక్రాంతికి పేదలు పిండివంటలు కాదుకదా, కనీసం పప్పు బువ్వ కూడా తినలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసి బియ్యం, పప్పు, ఉప్పు, చక్కెర, పామాయిల్ ఇలా వంట సరుకులేవీ ఈ నెల అందలేదు. దీంతో సకినాలు సుట్టుకుందామంటే బియ్యం లేవు..తీపి గారెలు చేద్దామంటే చక్కెర ఇవ్వలేదు...పిండివంటలు చేద్దామంటే పామాయిల్ లేదు.. ఇంగ పండుగ ఏం జేస్తం అంటూ తెల్లరేషన్ కార్డులున్న పేదలు ఆవేదన చెందుతున్నారు. కోటా పెరగక పోగా..అసలుకే ఎసరు సర్కార్ పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు బియ్యం, పప్పు, నూనె, చెక్కెరతో పాటు ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ప్రతి పండుగకూ ముందుగానే కోటా పెంచి మరీ నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా ఎలాంటి సరుకులు అందలేదు. ఇదేమిటని అడిగితే ఆహారభద్రతా కార్డులు తయారు కాలేదనీ, దీంతో సరుకుల పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆరు లక్షలపైచిలుకు రేషన్‌కార్డులుండగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,843 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం, పప్పు, ఉప్పు లాంటి సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఎక్కడా సరుకుల పంపిణీ జరగలేదు. ఆరు లక్షల పైచిలుకు రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలంటే 20.647 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఈనెల కేవలం ఆహారభద్రతాకార్డుల పూర్తయిన చోట్ల కేవలం 5 వేల క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేశారు. ప్రతి కుటుంబానికి కనీసం కిలో చక్కెర పంపిణీ చేయాలి. అయితే ఇప్పటి వరకు కేవలం అర కేజీ చొప్పున 550 క్వింటాళ్ల చక్కెర మాత్రమే సరఫరా చేశారు. సంక్రాంతి పండుగ పూట అరిశెలు, ఇతర పిండివంటలు చేసుకోవాలనుకునే కుటుంబాలకు అరకిలో చక్కెర ఏమాత్రం సరిపోదు. దీంతో ఎక్కువ రేటు పెట్టి మార్కెట్లో చక్కెర కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తుకు వస్తాయి. సకినాలు కాల్చుకోవాలంటే నూనె తప్పనిసరిగా ఉండాలి. అయితే చౌకధరల ద్వారా ఐదు మాసాలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారులు కిలో పామాయిల్‌కు రూ.80 పెట్టి మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చౌకధరల దుకాణం ద్వారా సరఫరా అవుతూ వచ్చిన పప్పు, గోధుమలు, ఉప్పు, చింతపండు లాంటి సరుకులు కూడా ఈ నెల సరఫరా కాలేదు. పండుగ పూట కూడా ప్రభుత్వం సరుకులు సరఫరా చేయకపోవటంపై పేదలు ఉడికిపోతున్నారు. సొంత రాష్ట్రంలో పేదలను అక్కున్న చేర్చుకుంటామని చెబుతున్న ప్రభుత్వం పండుగల రోజులు సైతం సరుకులు సరఫరా చేయకపోవటమేమిటని ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఆహార భద్రతాకార్డుల తయారీలో సమస్యలు, సరుకుల సరఫరాపై స్పష్టత కొరవడటం కారణంగానే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.