* ఇంతవరకూ అందని చక్కెర
* బియ్యం.. పప్పు.. ఉప్పూ కరువే
* ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్
* సర్కార్ తీరుపై పేదల ఆక్రోశం
సంగారెడ్డి: తెలంగాణలో పండుగరోజు పప్పన్నం తినటం కాదు, పాయసం తాగుదాం...పండుగకు వారం రోజుల ముందే పేదలకు అవసరమైన పండుగ సామాను అందజేస్తాం. - సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.
కానీ సీఎం మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తెలుగువారు చేసుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పెద్దోళ్లు..పేదోళ్లు అన్న తేడా లేకుండా పండుగపూట పిండి వంటలు చేసుకుని కుటుంబసభ్యులంతా సంతోషంగా తింటారు. అయితే ఈ సంక్రాంతికి పేదలు పిండివంటలు కాదుకదా, కనీసం పప్పు బువ్వ కూడా తినలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసి బియ్యం, పప్పు, ఉప్పు, చక్కెర, పామాయిల్ ఇలా వంట సరుకులేవీ ఈ నెల అందలేదు. దీంతో సకినాలు సుట్టుకుందామంటే బియ్యం లేవు..తీపి గారెలు చేద్దామంటే చక్కెర ఇవ్వలేదు...పిండివంటలు చేద్దామంటే పామాయిల్ లేదు.. ఇంగ పండుగ ఏం జేస్తం అంటూ తెల్లరేషన్ కార్డులున్న పేదలు ఆవేదన చెందుతున్నారు.
కోటా పెరగక పోగా..అసలుకే ఎసరు
సర్కార్ పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు బియ్యం, పప్పు, నూనె, చెక్కెరతో పాటు ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ప్రతి పండుగకూ ముందుగానే కోటా పెంచి మరీ నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా ఎలాంటి సరుకులు అందలేదు. ఇదేమిటని అడిగితే ఆహారభద్రతా కార్డులు తయారు కాలేదనీ, దీంతో సరుకుల పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆరు లక్షలపైచిలుకు రేషన్‌కార్డులుండగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,843 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం, పప్పు, ఉప్పు లాంటి సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఎక్కడా సరుకుల పంపిణీ జరగలేదు. ఆరు లక్షల పైచిలుకు రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలంటే 20.647 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఈనెల కేవలం ఆహారభద్రతాకార్డుల పూర్తయిన చోట్ల కేవలం 5 వేల క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేశారు. ప్రతి కుటుంబానికి కనీసం కిలో చక్కెర పంపిణీ చేయాలి. అయితే ఇప్పటి వరకు కేవలం అర కేజీ చొప్పున 550 క్వింటాళ్ల చక్కెర మాత్రమే సరఫరా చేశారు. సంక్రాంతి పండుగ పూట అరిశెలు, ఇతర పిండివంటలు చేసుకోవాలనుకునే కుటుంబాలకు అరకిలో చక్కెర ఏమాత్రం సరిపోదు. దీంతో ఎక్కువ రేటు పెట్టి మార్కెట్‌లో చక్కెర కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తుకు వస్తాయి. సకినాలు కాల్చుకోవాలంటే నూనె తప్పనిసరిగా ఉండాలి. అయితే చౌకధరల ద్వారా ఐదు మాసాలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారులు కిలో పామాయిల్‌కు రూ.80 పెట్టి మార్కెట్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చౌకధరల దుకాణం ద్వారా సరఫరా అవుతూ వచ్చిన పప్పు, గోధుమలు, ఉప్పు, చింతపండు లాంటి సరుకులు కూడా ఈ నెల సరఫరా కాలేదు. పండుగ పూట కూడా ప్రభుత్వం సరుకులు సరఫరా చేయకపోవటంపై పేదలు ఉడికిపోతున్నారు. సొంత రాష్ట్రంలో పేదలను అక్కున్న చేర్చుకుంటామని చెబుతున్న ప్రభుత్వం పండుగల రోజులు సైతం సరుకులు సరఫరా చేయకపోవటమేమిటని ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఆహార భద్రతాకార్డుల తయారీలో సమస్యలు, సరుకుల సరఫరాపై స్పష్టత కొరవడటం కారణంగానే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.
పండుగ పూటా పస్తులే..!
Published Wed, Jan 14 2015 10:23 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement