సాక్షి, నెల్లూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేలాది కటుంబాలు సంతోషిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఈ సారి శాసనసభ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. సమావేశాల్లో 16 చట్టాలను ప్రభుత్వం తీసుకుని రావడమే కాకుండా వాటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగడం హర్షనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విభజించడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలగనుందన్నారు. చంద్రబాబు రాజధానికి 40 వేల ఎకరాలు సేకరించి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేవలం ఒక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నించారని మండిపడ్డారు.
రైతుల భూములను బలవంతంగా లాక్కొని, టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు. రైతులకు చెందిన అసైన్‌మెంట్ భూములను వారికే ఇవ్వడం సముచితమన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి నిదర్శనమని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడిండ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని, ప్రజలు కూడా ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో తొలగించారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment