సింగిల్ డే సీఎంగానైనా....
నెల్లూరు : రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రంగా రగిలిపోతుంటే, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాత్రం చివరి దశలో అయినా సీఎం కుర్చీ సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సీఎం పదవికి రాజీనామా చేయటానికి రెండు రోజుల ముందు నుంచే ఆనం ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. 39 నెలల తర్వాత చేస్తున్న రెండో ప్రయత్నం నెరవేరొచ్చనే ఆశ ఆనం వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత 2009లో అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యకు సీఎం కుర్చీ వరించిన సంగతి తెలిసిందే. అనేక కారణాలరీత్యా 2010 నవంబరులో రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిని తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
అప్పట్లో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాంనారాయణరెడ్డి ఏఐసీసీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం పదవిపై అప్పట్లో ఆయన చాలా ధీమాగా వ్యవహరించారు. అయితే ఊహించని విధంగా అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడంతో ఆనం తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం కిరణ్ కచ్చితంగా అర్థాంతరంగా పదవి పోగొట్టుకోవడం ఖాయమని రాంనారాయణరెడ్డి అంచనా వేశారు. కిరణ్ రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని అధిష్టానానికి విన్నవించుకుంటున్న వర్గంతో ఆయన చేతులు కలిపారు.