అనంత మెడికల్‌ కళాశాల గల్లంతు | Anantapur Medical College Missing In Website | Sakshi
Sakshi News home page

అనంత మెడికల్‌ కళాశాల గల్లంతు

Published Tue, Jun 19 2018 9:13 AM | Last Updated on Tue, Jun 19 2018 9:13 AM

Anantapur Medical College Missing In Website - Sakshi

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

జేఎన్‌టీయూ: ఎంబీబీఎస్‌ జాతీయ కోటా సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ గందరగోళంగా మారింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) తప్పిదం కారణంగా సీట్ల భర్తీ ప్రక్రియలో వెబ్‌సైట్‌లో అనంతపురం మెడికల్‌ కళాశాల గల్లంతైంది . ఫలితంగా విద్యార్థులు ఆన్‌లైన్‌ ఆప్షన్‌ ఇచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. మరో వైపు తొలి దఫా ఆప్షన్ల నమోదు గడువు మంగళవారంతో  ముగియనుంది. అనంతపురం మెడికల్‌ కళాశాలలో 100 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ... తొలి దఫా వెబ్‌ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోవడంతో ప్రతిభావంతులు కళాశాలలో అడ్మిషన్‌ పొందకుండా పోయే ప్రమాదం నెలకొంది.

నీట్‌ ఆధారంగా భర్తీ
ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీలో ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ కోటా (నేషనల్‌ కోటా) విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ర్యాంకుల ఆధారంగా తొలుత జాతీయ కోటా సీట్లను భర్తీ చేస్తారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ( ఎంసీసీ) ఈ ప్రక్రియను చేపడుతోంది. ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో సాంకేతిక ప్రక్రియ , రాష్ట్రాల వారీ కాలేజీలు, సీట్ల వివరాలు నమోదు చేస్తుంది. మంగళవారం వరకు  సీట్ల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ ఆప్షన్‌కు ఎంసీసీ అవకాశం కల్పించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఎన్‌ఐసీ నేరుగా వివరాలు నమోదు చేయడంతో ఆన్‌లైన్‌లో మెడికల్‌ కళాశాలలు వివరాలు, సీట్ల వివరాల వెల్లడిలో తప్పిదాలు చోటు చేసుకున్నాయి.

రెండో విడతలోనే సీట్ల భర్తీ
తొలి దఫా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియలో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడడంతో వాటిని సవరణ చేసి రెండో దఫా కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఇందుకు ఎన్‌ఐసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో అనంతపురం మెడికల్‌ కళాశాలను జాబితాలో చేర్చనున్నారు.  జులై 6 నుంచి రెండో విడుత ఎంబీబీఎస్‌ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. తొలి విడతలో సీట్ల కేటాయింపునకు సంబంధించి ఈ నెల 22న జాబితా వెల్లడించనున్నారు.

ప్రతిభావంతులకు నష్టం
నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ వారు రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలల వివరాలు, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అయినా మేము వివరాలన్నింటినీ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు ఈ నెల 6కు ముందే పంపాం. ఇదే నెల 14న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేశాం. అయినా తొలి దఫాలో ఆన్‌లైన్‌ వెబ్‌ఆప్షన్స్‌లో అనంతపురం మెడికల్‌ కళాశాలను చూపలేదు. ప్రతిభావంతులు, అనంతపురం మెడికల్‌ కళాశాలలోనే చదవాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయే ప్రమాదం నెలకొంది. రెండో దఫా కౌన్సెలింగ్‌లో ప్రతిభావంతులు ఆప్షన్‌ తీసుకునే అవకాశం ఉండదు.– ప్రొఫెసర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement