రావొద్దు బాబూ.. ! | Anantapur TDP Leaders Fear on Chandrababu Naidu Bus Tour | Sakshi
Sakshi News home page

రావొద్దు బాబూ.. !

Published Mon, Feb 24 2020 12:27 PM | Last Updated on Mon, Feb 24 2020 12:27 PM

Anantapur TDP Leaders Fear on Chandrababu Naidu Bus Tour - Sakshi

చంద్రబాబు జిల్లాకు వస్తున్నా రంటే... ఊరంతా ‘పచ్చ’ తోరణాలు కట్టేసి హడావుడి చేసే నేతలంతా ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించారు. బాబ్బాబు మా జిల్లా కొద్దు... ఆ పక్క జిల్లాలో మీ ఇష్టం వచ్చినన్ని నియోజకవర్గాలు తిరగండి మేమే వచ్చిపోతాం... మా దగ్గరకు మాత్రం రాకండి... అంటూ వేడుకుంటు న్నారు. బాబు ప్రజాచైతన్య యాత్రలకు స్పందన లేక పోగా... బాబు టూర్‌కు జనాన్ని తేలేక చేతి చమురు వదులుతుండటంతో నేతలంతాచంద్రబాబే కబురుపంపుతున్నా... ముఖంచాటేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడం....పైగా చేతి చమురు వదులుతుండటంతో జిల్లాలో యాత్ర చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర వద్దంటే... వద్దంటూ స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి  ప్రజాచైతన్య యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని టీడీపీ అధినేత భావించారు. ఈ విధంగా సుమారు 100 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఈ నెల 17వ తేదీన ప్రకాశం జిల్లా బొప్పూడిలో యాత్ర ప్రారంభించారు. కానీ ఎక్కడా స్పందన కనిపించడం లేదు. 

అంత్మరథనంలో అనంత నేతలు..
చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఏఏ నియోజకవర్గాల్లో చేపట్టాలనే అంశంపై టీడీపీ నేతలు తాజాగా సమావేశమయ్యారు. అయితే, తమ నియోజకవర్గంలో వద్దంటే...తమ నియోజకవర్గంలో వద్దని నేతలు మూకుమ్మడిగా తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. యాత్రకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో పాటు యాత్రకు అయ్యే ఖర్చును ఎందుకు భరించాలనే భావనతోనే చంద్రబాబు యాత్ర వద్దని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పరువు పోతుందని భావించిన నేతలు... కనీసంరెండు నియోజకవర్గాల్లోనైనా యాత్ర చేపట్టి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రజాచైతన్యం... స్పందన శూన్యం
ఆరేడు నెలల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు మూడు రాజధానులపై ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే, మొదటి రోజున ప్రకాశం జిల్లాలో చేపట్టిన యాత్రలో చంద్రబాబు పాల్గొనగా... ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అంతేకాకుండా ఆరేడు నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉద్యోగాల కల్పన, పింఛన్ల మొత్తం పెంపు, అర్హులైన వారందరికీ అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లిపోయాయి. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఏకంగా రూ.7 లక్షల నష్టపరిహారం జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటికితోడు ఆటోవాలాలకు రూ.10 వేల సాయంతోపాటు విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కూడా ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఇన్నాళ్లూ పట్టించుకోని సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పేరుతో రాజకీయ ఉద్దేశంతో చేపడుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన ఏ మాత్రమూ ఉండటం లేదు. ఈ విషయం జిల్లాలోని టీడీపీ నేతలకు కూడా అర్థమయ్యింది. అందుకే యాత్ర  వద్దంటే వద్దని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఖర్చులకు జడిసి...!
ఒకవైపు చంద్రబాబుయాత్రకు ప్రజా స్పందన లేకపోవడం... మరోవైపు యాత్ర విజయవంతం చేయాలంటే తాము బాగా కష్టపడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో తమ జేబుల్లో నుంచి తీసి ఖర్చు ఎందుకు చేయాలనే భావనలో ఉన్నట్టు సమాచారం. అందులోనూ బలవంతంగా జనసమీకరణ చేయాల్సి రానుండటంతో ఖర్చు కొంచెం ఎక్కవే చేయాల్సి వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు జడిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్ర వద్దంటే వద్దని తేల్చిచెబుతున్నారు. అందువల్లే పార్టీ పరువును కాపాడేందుకు కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా యాత్ర చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల నేతలను ఒప్పించేపనిలో పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మొత్తమ్మీద చంద్రబాబు యాత్రకు ప్రజల నుంచే కాదు ఆ పార్టీ నేతల నుంచి కూడా స్పందన కనిపించకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement