
'నోట్' రావడం దుర్మార్గమైన చర్య: ఎంపీ అనంత
హైదరాబాద్: తెలంగాణా నోట్ కేబినెట్కు రావడాన్ని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి నివేదిక ఇచ్చిన తరువాతే ప్రక్రియ మొదలవుతుందని చెప్పిన వారు ఈరోజు మాట తప్పి తెలంగాణా నోట్ను తయారు చేయడం మంచిపద్దతి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తుది నిర్ణయం అనడానికి మనమేమి రాజుల పాలనలో లేమని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ ప్రజాభిప్రాయమే శిరోధార్యమని ఎంపీ తెలిపారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర ఎంపీలంతా హైదరాబాద్లో సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించి, డీల్లీకి వెళ్లనున్నట్లు ఎంపి మీడియాకు వివరించారు.