
సాక్షి, అనంతపురం : కియా కార్ల పరిశ్రమలో అర్హులైన స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ యాజమాన్యానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. కియా, దాని అనుబంధ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై గురువారం తన చాంబర్‌లో అహుడా వైస్ చైర్‌పర్సన్ ప్రశాంతితో కలిసి కియా యాజమాన్య ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. స్థానికులకు వారి విద్యార్హతల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా భూములిచ్చిన రైతుల పిల్లలకు కచ్చితంగా ప్రాధానత్యనివ్వాలన్నారు. ఉద్యోగాలకు తగిన వేతనమూ ఉండాలని సూచించారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జికి 19.33 ఎకరాలు కావాలి
కియా సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 19.33 ఎకరాలు అవసరమున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి కియా ప్రతినిధులు తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై రైతులతో చర్చించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, , పెనుకొండ ఆర్డీఓ శ్రీనివాస్‌కు సూచించారు. ప్రాజెక్టు లే–ఔట్ ఆమోదానికి చర్యలు తీసుకోవాలని అహుడా వీసీ ప్రశాంతికి సూచించారు. కియా ట్రైనింగ్ సైట్ నుంచి రోడ్డు ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో కియా కంపెనీ చీఫ్ అడ్మినిస్టేటివ్ అధికారి కిమ్, చీఫ్ కన్‌స్ట్రక్షన్ అధికారి జిమ్, లీగల్ హెడ్ జూడ్, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment