నెల్లూరు(అర్బన్),న్యూస్‌లైన్: నెల్లూరు నగర పాలక సంస్థలోని ఉద్యోగుల్లో ప్రస్తుతం నలుగుతున్న విషయం అధికారుల బదిలీలు. ఎవరు ఉంటారు.. ఎవరు బదిలీపై వెళతారు.. ఎవరైనా అధికారి సెలవు పెట్టి ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోతే ఇక బదిలీ అయినట్లేనంటూ చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రం విడిపోవడం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో అధికారుల్లో గుబులు రేగుతోంది. గత ఐదేళ్లలో అధికారులు కొంతమంది ‘బాస్’ అండదండలతో అక్రమాలకు పాల్పడ్డారు.
ముఖ్యంగా ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రాజకీయ అండదండలున్న ఉద్యోగులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఐదేళ్లలో నగర పాలక సంస్థలో వీరి హవానే సాగింది. అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ‘బాస్’ చెప్పాడంటూ ఇళ్లు కూడా కూల్చేసిన సందర్భాలున్నాయి. నగర పాలక సంస్థకు నిధులు వెల్లువెత్తడంతో అధికారుల జేబులు కూడా బాగానే నిండాయి. ముఖ్యంగా సాంకేతిక విభాగంలో కొంతమంది అధికారులు విచ్చలవిడితనానికి అదుపులేకుండా పోయింది. కొంతమంది అధికారులు ఐదేళ్లలోనే కోట్లకు పడగలెత్తారు. నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు కలిగి ఉండటం, బినామీ పేర్లతో కాంట్రాక్ట్‌లు కూడా చేశారు. ఇలా దొరికినకాడికి దోచుకున్నారు.
విద్యార్హతలపై అనుమానాలు
సాంకేతిక విభాగంలో పని చేస్తున్న కొంతమంది అధికారుల విద్యార్హతలపై కూడా అనుమానాలున్నాయి. సాంకేతిక అర్హత లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల విద్యార్హతలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు కూడా చేసినట్లు తెలిసింది. అయితే దరఖాస్తుదారులను తమ దారికి తెచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిం చినట్లు సమాచారం.
సెలవులో అధికారులు
నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు సె లవులో కొనసాగుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏసీపీ నాలుగురోజులుగా సెలవులో ఉన్నారు. సాధారణంగా అయితే ఆయన సెలవు పెట్టినా ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. సెలవుపెట్టిన నాటి నుం చి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంది.
అదేవిధంగా కమిషనర్ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య గత వారంలో మూడు రోజుల పాటు సెలవు పెట్టారు. తాజాగా శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. పదిహేను రోజుల పాటు ఆయన సెలవులో ఉంటారని తెలుస్తోంది. అయితే ఇది ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని సమాచారం. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల వద్దకు ఇప్పుటికే క్యూ కడుతున్నారు.
అక్రమార్జనపై ఆరా
నగర పాలక సంస్థలో అధికారుల అక్రమార్జనపై ప లువురు అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్య అధికారుల వద్ద నుంచి ఏఈ స్థాయి అధికారి వరకు, పలువురు కింది స్థాయి ఉద్యోగుల వ్యవహారశైలిపై అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారని సమాచారం. అధికారుల బారిన పడి నష్టపోయి న వారు అధికార పార్టీ నేతల వద్దకెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలుస్తోంది.
’ఇప్పటికే చేతులు కాల్చుకున్నాం.. ఇంకా కాల్చుకోవాలంటే మా వల్ల కాదంటూ ఇంజనీరింగ్ విభాగంలో ఓ ముఖ్య అధికారి సన్నిహితుల వద్ద ఇటీవల వాపోవడం వినిపించింది. ఈ నాలుగైదేళ్లలో నగర పాలక సంస్థలో జరిగిన ఆర్థిక అరాచకం ఆయన మాటల్లోనే వెల్లడవుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో అధికార మార్పిడి నగర పాలక సంస్థ అధికారులకు గుబులు పుట్టిస్తోంది. ఎవరిపై బదిలీ వేటు పడుతుందో, ఎవరి అక్రమాల పుట్ట బద్ధలవుతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది.
అక్రమార్కుల్లో కొత్త గుబులు
Published Sun, Jun 1 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement