హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు అంతకంతకూ ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని వారిని హెచ్చరించినా మంత్రుల వైఖరిలో ఏమాత్రం మార్పురాలేదు. చంద్రబాబు హెచ్చరించిన 24 గంటల్లోనే అయ్యన్నపాత్రుడు మరో సిఫార్సు చేశారు.
విశాఖ డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ ను కొనసాగించాలనే ప్రతిపాదనను అయ్యన్నపాత్రుడు మరోసారి చంద్రబాబు ముందుకు తీసుకొచ్చారు. ఎనిమిది నెలలుగా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉంటున్న శ్రీనివాస్ సేవలు అవసరమని లేఖలో అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం ఆర్డీవో బదిలీ వ్యవహారంలో అయ్యన్నపాత్రుణ్ని తీవ్రంగా మందలించినా మంత్రుల వైఖరిలో మార్పు రాకపోవడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.