సౌదీలో రామన్నపల్లి వాసి హత్య
రోడ్డు ప్రమాదంలో వర్షకొండ వాసి మృతి
ఐదు నెలలకు ఒకరి మృతదేహం.. మూడు నెలలకు మరొకరి శవం
స్వగ్రామానికి చేరిన వైనం
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, బంధువులు
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఇద్దరు అనూహ్యరీతిలో మృత్యువాతపడ్డారు. ఒకరు హత్యకు గురవగా.. మరొకరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కడసారి చూపు కోసం వారి కుటుంబ సభ్యులు నెలలకొద్దీ నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. ఐదు నెలల తర్వాత ఒకరి మృతదేహం.. మూడు నెలలకు మరొకరి మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరాయి. శవపేటికలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
రామన్నపల్లి(సిరిసిల్ల రూరల్), న్యూస్‌లైన్ :
సిరిసిల్ల మండలం రామన్నపల్లికి చెందిన అడితం బాలమల్లు(38) అనే వలస కార్మికుడు ఏడాదిన్నర క్రితం కంపెనీ వీసాపై సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడి మున్సిపాలిటీలో దినసరి కార్మికుడిగా విధులు నిర్వహించారు. ఐదు నెలల క్రితం రోజులాగే బస్సులో తోటి కార్మికులతో డ్యూటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కార్మికులు పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చే శారు. వారం రోజుల తర్వాత ఓ పాత భవనంలో బాలమల్లు మృతదేహాన్ని గుర్తించారు. హత్య జరిగినట్లు నిర్ధారించారు. సౌదీ అధికారులు, ఇండియన్ ఎంబసీ అధికారులు నిర్లక్ష్యంతో మృతదేహం స్వగ్రామానికి రావడానికి ఐదు నెలల పట్టింది. సోమవారం శవం స్వగ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలుమల్లుకు భార్య భూలక్ష్మి, కూతరు ప్రవళిక, కొడుకులు పవన్, ప్రశాంత్ ఉన్నారు. బాలమల్లు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. బాలమల్లు కుటుంబాన్ని బీజేపీ నేత కొట్టాల మోహన్‌రెడ్డి పరామర్శించారు.
మూడు నెలలకు స్వగ్రామం చేరిన వాజిద్ శవం
వర్షకొండ(ఇబ్రహీంపట్నం) : జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన ఇబ్రహీపట్నం మండలం వర్షకొండకు చెందిన షేక్‌వాజిద్(40) మూడు నెలల క్రితం అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సోమవారం అతడి శవం స్వగ్రామానికి చేరింది. షేక్‌వాజిద్ సౌదీ అరేబియాకు చెందిన సడాఖా ఓఅండ్‌ఎం గ్రూప్ బల్దియా కంపెనీలో లేబర్‌గా పనిచేసేందుకు మూడేళ్ల క్రితం వెళ్లాడు. ఈ ఏడాది అక్టోబర్ 6న రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియన వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామానికి పంపించాలని కుటుంబ సభ్యులు అధికారులను పలుమార్లు వేడుకున్నారు. మూడు నెలల తర్వాత మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వాజిద్‌కు భార్య భానుబేగం, కూతుళ్లు గౌసియా, హలిమా, షాలిమా ఉన్నారు.
గల్ఫ్ వెళ్లారు.. శవమై వచ్చారు
Published Tue, Dec 31 2013 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement