‘జంజీర్’, ‘తుఫాన్’ విడుదలకు అడ్డంకుల్లేకుండా చూడండి
జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకులూ కలగకుండా చూడాలని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. ఈ నెల 6న విడుదలవుతున్న ఈ రెండు సినిమాలను ప్రదర్శించే థియేటర్ల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శనకు ఆటంకాలేమీ కలగకుండా తగిన భద్రత ఏర్పాట్లకు పోలీసులను ఆదేశించాలని విన్నవిస్తూ రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహనరావు గురువారం విచారించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనల వల్ల జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శనకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని నివేదించారు. ప్రతీ వారం సినిమాలు విడుదలవుతున్నా ఆందోళనకారులు అడ్డుకోలేదని, అయితే తమ సినిమాలను అడ్డుకుంటామని కొందరు హెచ్చరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి... జంజీర్, తుఫాన్ సినిమాల విడుదల, ప్రదర్శనలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చ ర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.