విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. ఏపీ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. అంతకు ముందు ఇదే అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దాంతో కీలక అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సభ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు తమ పట్టు వీడలేదు. దాంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. మరోవైపు ప్రతిపక్షం సభను జరగనివ్వకుండా విలువైన సమయాన్ని వృధా చేస్తోందంటూ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఏ సమస్యపైనా అయినా చర్చించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా సమావేశాలకు సహకరించాలని ప్రతిపక్షాన్ని విజ్ఞప్తి చేశారు.