గంటలోపే రెండుసార్లు వాయిదా..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గంటలోపే రెండుసార్లు వాయిదా పడ్డాయి. నినాదాలు, విమర్శలతో మూడో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే పది నిమిషాలు వాయిదా పడ్డాయి. డ్వాక్రారుణాల మాఫీ చేస్తామన్న హామీపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వాయిదాతీర్మానం ఇచ్చింది.
వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చర్చించాలని రూల్ 344 కింద నోటీసు ఇచ్చారు. డ్వాక్రా మహిళల ఉద్యమానికి మూలకారకుడు చంద్రబాబు అని, డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే హక్కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.
ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై చర్చ కాకుండా రచ్చ చేయడానికే ప్రతిపక్షం నేతలు వస్తున్నట్లుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాలు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా ప్రతిపక్షం మాత్రం తన పట్టువీడలేదు. చర్చకు అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. దాంతో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా సభకు అంతరాయం కలగటంతో స్పీకర్ సభను రెండోసారి పదినిమిషాల పాటు వాయిదా వేశారు.