విపక్షాల నిరసనల మధ్య అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గంటపాటు వాయిదా పడ్డాయి. గురువారం సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. నేడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభకు రానున్న ఈ నేపథ్యంలో ఇరుప్రాంత సభ్యులు సభలో తమ ప్రాంతాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు. దాంతో వారిని ఎంత వారించిన వినకపోవడంతో శాసనసభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకు ముందు విద్యుత్ చార్జీల పెంపు, అప్రకటిత విద్యుత్ కోతలపై సభలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేసింది. విద్యుత్ కోత, తాగు నీటి కొరతపై ఎంఐఎం, అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల పెంపుపై సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా ద్రవ్య వినిమయ బిల్లును నేడు శాసనసభ ఆమోదించనుంది. అయితే గత రెండేళ్ల ప్రభుత్వ వ్యయాలపై ఆడిట్ రిపోర్టులను కాగ్ సభ ముందు ప్రవేశపెట్టింది.