జీఎస్టీ బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
అమరావతి: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒకే దేశం...ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.
మరోవైపు రైతులను ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది.