మృగాళ్లకు ఇక మరణ శాసనమే | Andhra Pradesh Assembly Unanimous Approval Of AP Disha Bill | Sakshi
Sakshi News home page

మృగాళ్లకు ఇక మరణ శాసనమే

Published Sat, Dec 14 2019 1:45 AM | Last Updated on Sat, Dec 14 2019 4:53 AM

Andhra Pradesh Assembly Unanimous Approval Of AP Disha Bill - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో మొట్టమొదటిసారి మహిళలు, బాలి కల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చారి త్రాత్మక ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ’ బిల్లుకు ఏపీ శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళలు, బాలికలపై అత్యా చారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాస నం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ క్రిమినల్‌ లా చట్టం– 1973ను ఏపీకి వర్తింపచేయడంతోపాటు, అందులో అవసరమైన సవరణల చేస్తూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు–2019’ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. అలాగే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా.. సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా మహిళల్ని వేధించడం, అసభ్య పోస్టింగులు పెడితే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో కొత్త సెక్షన్లను చేర్చారు.

అలాగే మహిళలు, బాలలపై నేరాల్ని త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటునకు వీలు కల్పించే ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం– మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు–2019’కు కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను శుక్రవారం శాసనసభలో హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టగా.. చర్చలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష సభ్యులంతా మద్దతు పలికారు. అనంతరం సభ్యుల హర్షధ్వానాల బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ దిశ’ చట్టం, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు చట్టంలోని ముఖ్యాంశాలు
నిర్భయ చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో జైలు లేదా ఉరిశిక్ష విధిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంతో అత్యాచారాలకు పాల్పడిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష అమలు చేస్తారు.
నిర్భయ చట్టంలోని సెక్షన్ల ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి మరో 2  నెలల్లో శిక్ష పడేలా చూడాలి. మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. ‘ఏపీ దిశ’ చట్టంలో 4 నెలల సమయాన్ని 21 పనిదినాలకు కుదించారు.  
అత్యాచారం వంటి దురాఘతాలకు పాల్పడినప్పుడు విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభిస్తే.. 21 పనిదినాల్లో నిందితుడికి మరణశిక్ష పడాలి. ఏడు పనిదినాల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 పనిదినాల్లో న్యాయప్రక్రియ పూర్తి చేసి శిక్ష విధించాలి.
పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇప్పటి వరకూ పోక్సో చట్టం కింది ఏడాదిలోగా న్యాయప్రక్రియ పూర్తిచేయాలి. అయితే దిశ చట్టం ప్రకారం 7 పని దినాల్లో దర్యాప్తు, 14 పనిదినాల్లో న్యాయ విచారణ పూర్తిచేయాలి.
పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ శిక్షల్ని పెంచారు. ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు ప్రస్తుతం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష అమల్లో ఉంది. నేర తీవ్రతను బట్టి ఆ శిక్షను గరిష్టంగా జీవిత ఖైదుగా మార్చారు. ఇందుకోసం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)లో కొత్తగా సెక్షన్‌ 354(ఎఫ్‌)ను చేర్చారు. 
సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ నిర్ధిష్టమైన శిక్షలు లేవు. అయితే దిశ చట్టం ప్రకారం మెయిల్స్‌ లేదా సోషల్‌ మీడియా లేదా డిజిటల్‌ మాధ్యమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే..  మొదటిసారి రెండేళ్ల జైలు, రెండోసారి కూడా చేస్తే 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు గరిష్టంగా రూ. 5లక్షల వరకు జరిమానా విధించేలా ఐపీసీలో 354 (ఇ) సెక్షన్‌ను తీసుకొచ్చారు. 

దేశ చరిత్రలో తొలిసారి ప్రత్యేక కోర్టులు
ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలో తొలిసారి మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు.. త్వరితగతిన విచారణ ప్రక్రియ ముగించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం– మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు–2019’ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. 

అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే నేరాల్ని ఈ ప్రత్యేక కోర్టులు విచారిస్తాయి. ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువు.. కేంద్ర ప్రభుత్వ చట్టంలో 6 నెలలుగా ఉండగా.. ఇప్పుడు మన రాష్ట్రం పరిధిలో కేవలం 45 రోజులకు తగ్గించారు.

మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇంతవరకూ ఎలాంటి ఏర్పాట్లు లేవు. కొత్త చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని కల్పించారు. 

మహిళలు, పిల్లలపై నేరాలు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్ట్రీని కొనసాగిస్తోంది. అయితే జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే ఎవరు ఏ నేరం చేశారన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అలాంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా నేరాలకు సంబంధించిన వివరాలు ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement