జనరంజక బడ్జెట్‌ | Andhra Pradesh Budget 2019 Reflects People Welfare | Sakshi
Sakshi News home page

జనరంజక బడ్జెట్‌

Published Sat, Jul 13 2019 3:19 AM | Last Updated on Sat, Jul 13 2019 12:53 PM

Andhra Pradesh Budget 2019 Reflects People Welfare - Sakshi

సాక్షి, అమరావతి:  ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నవరత్నాలతో కూడిన జనరంజక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు అన్ని వర్గాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు, ఏ ఏ వర్గాలకు, ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా వివరించారు. బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు అభివృద్ది పంట పండించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు 2019–20 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అన్ని వర్గాల వారికీ కేటాయింపులు
ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.  గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, పట్టణ సచివాలయాలకు నిధులు కేటాయించారు. ఇందు కోసం రూ.1,880 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేశారు. అన్ని సంక్షేమ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పేరు పెట్టగా.. అమ్మ ఒడి, విద్యా దీవెనకు మాత్రం జగనన్న పేరు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద బడ్జెట్‌లో 716.26 కోట్ల రూపాయలు కేటాయించారు.

కాపులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు
కాపుల సంక్షేమానికి ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్‌లో కేటాయిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు జగన్‌మోహన్‌రెడ్డి ఆ మాటను నిలబెట్టుకుంటా బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.15,000.85 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.4,988.52 కోట్లు, బీసీ ఉప ప్రణాళిక కింద రూ.15,061.64 కోట్లు కేటాయించారు.  అగ్రి గోల్ట్‌ బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం రూ.1,150 కోట్లు, ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద బడ్జెట్‌లో రూ.500 కోట్లు, కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,572 కోట్లు కేటాయించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద సున్నా వడ్డీకి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి రూ.1,788 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.29,329.98 కోట్లు కేటాయింపులు చేశారు. మొత్తం రూ.2,27,974.99 కోట్ల వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు, మూల ధన వ్యయం రూ.32,293.39 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం రూ.1,78,697.41 కోట్లు, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.34,833.18 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60,071.51 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు, ద్రవ్య లోటు రూ.35,260.58 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

 

విద్యా రంగానికి  పెద్దపీట
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సాధారణ విద్యకు రూ.32,618 కోట్లు కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు రూ.15,000 చొప్పున సాయం అందించేందుకు రూ.6,455.80 కోట్లు, స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు, వైఎస్సార్‌ స్కూల్స్‌ నిర్వహణకు రూ.160 కోట్లు కేటాయించారు. వైద్య రంగానికి   రూ.11,399.23 కోట్ల కేటాయింపులు చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీకి రూ.1,740 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు రూ.1,500 కోట్లు, ఆశా వర్కర్లకు పెంచిన వేతనాలను చెల్లించేందుకు రూ.455.85 కోట్లు కేటాయింపులు చేశారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో భాగంగా ఆ జలాలను శ్రీశైలానికి మళ్లించడంతో పాటు పోలవరం, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా బడ్జెట్‌లో జల వనరుల శాఖకు రూ.13,139 కోట్లు కేటాయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల గృహాల నిర్మాణాలకు రూ.9,785.75 కోట్లు, వైఎస్సార్‌ గృహ వసతికి ఏకంగా రూ.5,000 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, వికలాంగ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.4,962.30 కోట్లు కేటాయించారు.

రైతుల సంక్షేమానికి  రూ.21,161.54 కోట్లు
బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులు చేశారు. రైతుల సంక్షేమానికి మొత్తం 21,161.54 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో  వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా 12,500 రూపాయల చొప్పున ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్‌లో రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతులకు వడ్డీ లేని రుణాలకు, ఉచితంగా బోర్లు వేయడానికి, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్‌  సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, పంటల బీమా ప్రీమియంకు బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు చేశారు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లకు సైతం భారీగా నిధులు కేటాయించారు. పెన్షన్లకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకగా నామకరణం చేశారు. అన్ని రకాల పింఛన్లకు రూ.15,746.58 కోట్లు కేటాయించారు. ఇందులో వృద్ధులు, వితంతువులకే రూ.12,801.04 కోట్లు ఉండటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement