సాక్షి, అమరావతి : పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆ భవనాలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, ఆ భవనాలకు మూడేళ్లుగా కరెంట్ బిల్లులు కూడా కట్టలేదని తెలిపారు. వాటిని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనే తెలంగాణకు ఇచ్చామన్నారు.
సీఎం జగన్ పాలనలో రైతులకు పెద్దపీట
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎలీజా వ్యాఖ్యానించారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు సీఎం జగన్ పెద్దమొత్తంలో కేటాయింపులు చేశారని తెలిపారు. చింతలపూడి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని, చింతలపూడి ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారని చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక మంది నిర్వాసితులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో కూడా భారీగా అవినీతి జరిగిందన్నారు. టీడీపీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు.
నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయి: మనుగుంట
గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కందుకూరు సమస్యలను ప్రస్తావించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలింపు జరిగిందన్నారు. చెరువుల్లో నీళ్లు లేవని, కంప చెట్లతో నిండిపోయిందని అన్నారు. చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. మధ్య,చిన్న తరహా చెరువులపై దృష్టి సారించాలని కోరారు.
తెలుగుగంగ ప్రాజెక్టును వైఎస్సార్ వరంలా ఇచ్చారు
తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖరరెడ్డి గూడూరుకు వరంలా ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గూడూరు బ్యారేజీ ఎత్తు పెంపును పరిశీలించాలని కోరారు. తెలుగుగంగ ప్రతి ఒక్క చెరువుకు వెళ్లే విధంగా స్వర్ణముఖి నదిని అభివృద్ధి పరచటానికి 3టీఎంసీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment