‘నవ’ యుగం | Buggana Rajendranath Reddy Presents AP Budget 2019 | Sakshi
Sakshi News home page

‘నవ’ యుగం

Published Sat, Jul 13 2019 4:03 AM | Last Updated on Sat, Jul 13 2019 12:08 PM

Buggana Rajendranath Reddy Presents AP Budget 2019 - Sakshi

బడ్జెట్‌ పత్రాల బ్యాగ్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

‘నేను విన్నాను... నేను ఉన్నాను’... అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా విలువేమిటో తొలి వార్షిక బడ్జెట్‌ తెలియజెప్పింది. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. పార్టీలు అసలే లేవు.. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి.. మాత్రమే సర్కారు లక్ష్యమని బడ్జెట్‌ ప్రతిపాదనలు రుజువుచేశాయి. సంక్షేమరథాన్ని ఉరకలెత్తిస్తూ రూ. 2,27,974 కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2019–20 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. నవరత్నాలకు పెద్దపీట వేసి ‘నవ’ యుగానికి నాంది పలికారు. తొలిబంతినే సిక్సర్‌ కొట్టినట్లు తొలి పద్దులోనే ఎన్నికల హామీలలో 80 శాతానికిపైగా నెరవేర్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం వంటి ప్రాధాన్య రంగాలకు భారీగా కేటాయించారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే అపర సంజీవనిగా కితాబులందుకుంటోంది. ‘జగనన్న అమ్మ ఒడి’ తమ బిడ్డల చదువులకు, భవిష్యత్తుకు ఎనలేని భరోసా అని పేదింటి తల్లులు మురిసిపోతున్నారు... సమాజంలోని ఏ వర్గాన్నీ ఈ బడ్జెట్‌ విస్మరించలేదు. ఆటోడ్రైవర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, చేనేతలు, బ్రాహ్మణులు, లాయర్లు, మౌజన్‌లు, పాస్టర్లు ఇలా అన్ని వర్గాలకు తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలి సంతకం, తొలి కేబినెట్‌ నిర్ణయాలు, తొలి బడ్జెట్‌ ప్రతిపాదనలు.. ఇలా అన్నీ సంచలనాలే.. అభివృద్ధి పథాన వడివడి అడుగులే..

ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు
ప్రజల సంక్షేమానికి, వారి కన్నీరు తుడవడానికి నిబద్ధతతో సురాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను
నెరవేర్చడానికి స్పష్టమైన లక్ష్యాన్ని, కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం కలిగి ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించాలని అధికారులందరినీ ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీల వంటివి చూడొద్దని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, తద్వారా ప్రజల నిజమైన హక్కులను, సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించింది. గత పాలనా వ్యవస్థకు, ప్రస్తుత ప్రభుత్వానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా.సింగపూర్‌ అంతర్జాతీయ విమానాలకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సమకూర్చాలా లేక వేలాది మంది తల్లులు, పిల్లలకు మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దాన్ని వదిలేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సమున్నత లక్ష్యాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అవినీతి రహిత, పారదర్శక సంక్షేమ పాలనే తమ సర్కారు లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వ ప్రాధామ్యాల మేరకు ఉన్నంతలో బడ్జెట్‌ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,27,974.99 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శానససభలో ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ‘జగనన్న అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, రైతులకు భరోసా, యువతకు చేయూత, వృద్ధులకు పింఛన్లు, అందరికీ ఇళ్లు, దశల వారీగా మద్య నిషేధం తమ సర్కారు ప్రాధామ్యాలని వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాలకూ భరోసా కల్పిస్తాయని, వీటి అమలు దిశగా బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించామని అన్నారు. 

అవినీతికి చెక్‌ పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నాం..
‘‘టెండర్లలో అవినీతికి చెక్‌ పెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పోలవరం ప్రాజెక్టుతో సహా సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టుల్లో అవినీతిని నిరోధించడానికి జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక స్థితిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారసత్వంగా పొందింది. విభజన సమయంలో రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018–19 నాటికి రూ.2,58,928 కోట్లకు పెరిగిపోయింది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు తీసుకుని గత ప్రభుత్వం ఆయా నిధులను ఇతర అవసరాల కోసం దారి మళ్లించింది. దీనికి అదనంగా మరో రూ.18 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ఫిబ్రవరిలో సమర్పించిన 2019–20 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కింద ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు దాదాపు రూ.45 వేల కోట్ల వనరుల అంతరం ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్థిక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలతో పాటు పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నాం. విభజన చట్టంలో కొంత స్పష్టత లేదనే కారణంతో హామీలు నిష్ప్రయోజనం కాకూడదు.  

బడ్జెట్‌లో ముఖ్య కేటాయింపులు ఇలా..

  • గ్రామ వలంటీర్లు, సచివాలయాలకు- రూ.1,420 కోట్లు
  • సంక్షేమ పింఛన్లకు- రూ.15,746.58 కోట్లు 
  • సాగునీటి ప్రాజెక్టులకు- రూ.13,139.05 కోట్లు  
  • గృహ నిర్మాణాలకు- రూ.9,785.75 కోట్లు 
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు- రూ.4,962.30 కోట్లు 
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు- రూ.4,962.30 కోట్లు 
  • అమరావతి మౌలిక సదుపాయాలకు- రూ.500 కోట్లు
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి- రూ.1,740 కోట్లు
  • పోలవరం ప్రాజెక్ట్‌కు- రూ.5,129 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు భరోసాకు- రూ.8,750 కోట్లు
  • జగనన్న అమ్మ ఒడికి- రూ.6,455.80 కోట్లు

2022 నాటికి లేమితనం ఉండొద్దు 
సింగపూర్‌ అంతర్జాతీయ విమానాలకు వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సమకూర్చాలా లేక వేలాది మంది తల్లులు, పిల్లలకు మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దాన్ని వదిలేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి, ఎంపికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా సంక్షేమం, సంపద కల్పన రెండింటినీ సమతుల్యం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చేలా మా బడ్టెట్‌ను రూపొందించాం. 

రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం 
2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెండింతలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు అనుకూల పథకాలు ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యం. ముఖ్యమంత్రి అధ్యక్షతన వ్యవసాయ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రైతుకు ప్రతిఏటా మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తాం. 64.06 లక్షల మంది రైతులు, 15,36 లక్షల మంది కౌలు రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదే. రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు  ప్రభుత్వం కౌలు రైతులకు సైతం ‘వైఎస్సార్‌ వడ్డీలేని రుణాలు’ ఇస్తుంది. పంట నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ‘వైఎస్సార్‌ పంటల బీమా’ను అమలు చేస్తాం. రైతుల తరఫున పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పశువులకు కూడా బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని బడ్జెట్‌లో ప్రతిపాదించాం. తిత్లీ తుపాను బాధితుల కోసం రూ.150 కోట్లు కేటాయించాం. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు 
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు ‘వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్‌’లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల కోసం 13 శీతల గిడ్డంగులు, 24 గోదాములను అభివృద్ధి చేస్తాం. కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.4,000 సాయాన్ని రూ.10,000 పెంచుతాం. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మార్చేయాలని నిర్ణయించాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బడెŠజ్‌ట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించాం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండే వారికి(కుక్‌లు) ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచాం.



మళ్లీ ‘కుయ్‌.. కుయ్‌’ 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వైఎస్సార్‌ ఆశయాలను నెరవేర్చడానికి ఆయా కార్యక్రమాలకు తిరిగి ప్రాణం పోయాల్సి ఉంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేసులకు చికిత్స అందించాలని సర్కారు ప్రతిపాదిస్తోంది. మరో 432 ‘108’ అంబులెన్సులు కొనాలని ప్రతిపాదించాం. ‘104’ సేవల కోసం మరో 676 అంబులెన్సులు కొనాలని నిర్ణయించాం. వచ్చే రెండేళ్లలో ఉత్తమ కార్పొరేట్‌ ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ప్రణాళిక రూపొందించి ఈ ఏడాది రూ.1,500 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించాం. పాడేరు, అరకులో రూ.66 కోట్ల ప్రాథమిక వ్యయంతో ఈ సంవత్సరం గిరిజన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పల్నాడు కోసం గురజాలలో, ఉత్తరాంధ్ర కోసం విజయనగరంలో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. 

2.81 లక్షల మంది వలంటీర్ల నియామకం 
ఇల్లు లేని 25 లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఉగాది సందర్భంగా 25 లక్షల కుటుంబాల మహిళలకు ఇంటి జాగాలు ఇవ్వనున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 300 చదరపు అడుగుల వరకూ గల పట్టణ గృహనిర్మాణ లబ్దిదారులకు రుణ భారాన్ని మాఫీ చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో 2.81 లక్షల వలంటీర్లను నియమిస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా లక్ష కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తూకాల్లో, నాణ్యతలో ఎక్కడా తేడా లేకుండా ప్యాకెట్లలో నిత్యావసర సరకుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. 

బీసీల కోసం 130 ప్రత్యేక కార్పొరేషన్లు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ’ పథకాన్ని అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ యూనిట్ల పరిధిని 100 నుంచి 200కు పెంచుతున్నాం. నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆదాయం పెంపు కోసం ఏటా రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేలు సమకూర్చనుంది. బీసీల కోసం 130 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచాం. భూ వివాదాలకు తావులేని విధంగా సర్వే చేసి, టైటిల్‌ హక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఉద్ఘాటించారు.

చతుర్విధ వికాసాలు 
తమ ప్రభుత్వ లక్ష్యం చాణుక్యుని ‘చతుర్విధ వికాసాల’ మాదిరిగా ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.. సాధించిన దాన్ని సుస్థిర పర్చుకోవడం.. సుస్థిర పరచిన దాన్ని విస్తరించడం.. విస్తరించిన దాన్ని నలుగురికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దడం..’  ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలని పేర్కొన్నారు. 

‘ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగే పరిస్థితులు ఉండాలి’ అన్న మహాత్మాగాంధీ మాటలతో బుగ్గన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు.

ఉన్నత విద్యాభ్యాసానికి ‘జగనన్న విద్యా దీవెన’
మెట్రిక్‌ అనంతర కోర్సులు చదివే విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ‘జగనన్న విద్యా దీవెన’ పథకానికి అంకురార్పణ చేశామని బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. ‘‘అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఈ పథకం కింద అందుతుంది. ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.20,000 చొప్పున అందిస్తుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.4,962.3 కోట్లు ప్రతిపాదించాం. వివిధ పథకాలకు పేర్లు పెడుతున్న సందర్భంగా మేం వీటికి జగనన్న పేరు పెట్టాలని నిర్ణయించాం. అయితే తన పేరు వద్దే వద్దని ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఈ పథకాలు జగన్‌ రూపొందించినవే కాబట్టి ఆయన పేరు పెట్టేందుకు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చి ఒప్పించాం’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  

ఎడిసన్‌ స్ఫూర్తిగా ‘జగనన్న అమ్మఒడి’ 
ప్రతి ఒక్కరికీ విద్యావంతులయ్యే అవకాశం కల్పించాలన్న ఆశయంతో ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు ఒక పిల్లవాడు బడికి వెళితే అతడికి అర్థం చేసుకునే శక్తి లేదని పాఠశాల యాజమాన్యం వెనక్కి పంపింది. నా బిడ్డకు చదువుకునే తెలివి ఎందుకు లేదో చూద్దామనే పట్టుదలతో  ఆ తల్లి తన చిన్నారిని సొంతంగా చదివించింది. నాటి ఆ బాలుడే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిసన్‌. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రకటిస్తున్నాం. పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15,000 ఈ పథకం కింద ఇస్తాం. దీన్ని ఇంటర్మీడియట్‌కు కూడా విస్తరించాం. ఈ పథకం కింద 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. అమ్మఒడి అమలు కోసం బడ్జెట్‌లో రూ.6,455 కోట్లు కేటాయించాం’’ అని బుగ్గన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement