వాణిజ్య ప్రదర్శనలతో రాష్ట్రాభివృద్ధి: చంద్రబాబు
* ఐఈఐఏ సదస్సులో సీఎం చంద్రబాబు
* ట్రేడ్‌ఫెయిర్‌ల నిర్వహణకు పలు నగరాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని వెల్లడి
* రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య ప్రదర్శనల(ట్రేడ్ ఫెయిర్) ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నైపుణ్య, వైజ్ఞానిక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ట్రేడ్ ఫెయిర్‌ల నిర్వహణ కోసం రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న 20 ఏళ్లకు సరిపడా వాణిజ్యరంగ అవసరాలను ఈ కన్వెన్షన్ సెంటర్లు తీరుస్తాయన్నారు. శనివారం ఇక్కడి హైటెక్స్‌లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఐఈఐఏ)నిర్వహించిన సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు.
వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల నిర్వహణవల్ల నగరాలు, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని వివరించారు. ఆఫ్రికాలోని నైగర్ ఏటా ప్రదర్శనలు, వాణిజ్య సదస్సుల నిర్వహణద్వారా ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసుకుంటోందన్నారు. వాణిజ్య ప్రదర్శనల ద్వారా జర్మనీకి ఏటా 23.5 బిలియన్ యూరోల ఆదాయం వస్తోందని, 2.26 లక్షల మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఇలాంటి వాణిజ్య ప్రదర్శనల ద్వారా అన్ని రంగాలమధ్య సమన్వయం, పరస్పర సహకారం కుదిరి ఏపీ కూడా త్వరిత గతిన ఆర్థికంగా అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌నుతీర్చిదిద్దుతా
రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 14 ఎయిర్‌పోర్టులను, నాలుగు పోర్టులను నెలకొల్పి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఫైబర్ ఆప్‌టెక్ ద్వారా ప్రతి ఇంటికీ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
టూరిజంలో ఏపీని అగ్రభాగాన నిలుపుతానని చెప్పారు. వ్యవసాయం, పవర్‌గ్రిడ్, అర్బన్ డెవలప్‌మెంట్, గ్యాస్ కనెక్టివిటీ తదితర ఏడు అంశాలతో కూడిన మిషన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ సాధించేందుకు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడిందీ ఈ సందర్భంగా వివరించారు. సైబర్ టవర్స్‌తోపాటు హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వంటి నిర్మాణాలతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
నైపుణ్యం, ఉత్పాదకత పెంపుపై దృష్టి సారిస్తాం: చంద్రబాబు
నైపుణ్యం పెంచటంద్వారా వివిధ రంగాల్లో ఉత్పాదకతను పెంచి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన నమూనాగా రూపొందించాలన్నది తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. శనివారం సీఎంను క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగృహంలో జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డీసీ) ఎండీ, సీఈవో దిలీప్ చెనాయ్ కలిశారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి ఏ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలేంటీ.. వాటిలో ఆచరణ యోగ్యమైన పద్ధతులేమిటీ.. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి ఎన్‌ఎస్‌డీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. కేంద్రం నుంచి నిధులు ఎంతమేరకు వస్తాయి.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను నైపుణ్య అభివృద్ధికి ఎలా సమీకరించవచ్చు.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకతను నైపుణ్య అభివృద్ధిద్వారా ఎలా పెంచవచ్చు.. అనే అంశాలపై చెనాయ్‌తో ఈ సందర్భంగా సీఎం చర్చించారు. నైపుణ్యం పెంపుద్వారా వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపుపై నివేదిక ఇవ్వాలని కోరారు. త్వరలోనే నైపుణ్య అభివృద్ధి మిషన్‌ను ప్రారంభించేందుకు కావాల్సిన సహాయ సహకారాలను తమ సంస్థ అందిస్తుందని చెనాయ్ హామీనిచ్చారు. ఏడాదిలోగా దేశానికే ఆదర్శవంతమైన నమూనాను రూపొందించేందుకు ఎన్‌ఎస్‌డీసీ ముందుకొస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, గంటా సుబ్బారావు, డీవీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.