Trade fair
-
ఏపీ పెవిలియన్‌కు విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్–2023లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘వసుధైక కుటుంబం–యునైటెడ్ బై ఇండియా’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న ప్రారంభమైన ఎగ్జిబిషన్ నవంబర్ 27వ తేదీతో ముగియనుంది. రాష్ట్రం నుంచి 195 దేశాలకు 3,137 ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో కుటుంబ సభ్యులుగా మారి వసుధైక కుటుంబంగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని తెలియచేసే విధంగా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎగ్జిబిషన్లో 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సందర్శకులను కట్టిపడేసే విధంగా ఏపీ పెవిలియన్ తీర్చిదిద్దింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. భారీగా సందర్శకుల తాకిడి రాష్ట్రంలోని హస్తకళలు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో పాటు హస్తకళా ఉత్పత్తులతో ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉందని, ప్రతిరోజు లక్ష మందికిపైగా సందర్శకులు పెవిలియన్‌ను సందర్శిస్తున్నారని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. కలంకారీ, మంగళగిరి జరీ, ధర్మవరం పట్టు, నెల్లూరు ఉడెన్ కట్లరీ, లేపాక్షి, తోలు బొమ్మలు వంటి వాటికి సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చిదని, పలువురు భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు. నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో నాడు–నేడు కింద అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో వివరిస్తూ ఆర్ట్ రూపంలో ఏర్పాటు చేసిన చిత్రానికి మంచి స్పందన వచ్చిదని, పలువురు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారని చెప్పారు. అధికారులకు అభినందన పెవిలియన్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వైఎస్సార్ ఏపీ వన్ కింద ఏవిధంగా త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నారో తెలియజేసే కియోస్్కని పలువురు సందర్శించారు. 974 కి.మీ. తీర ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నదీ, మత్స్య ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పలువురు ఫొటోలు దిగుతున్నారు. సాయంత్రం వేళ రాష్ట్రంలోని సంప్రదాయ కళలను పరిచయం చేసేవిధంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా పెవిలియన్‌ను తీర్చిదిద్దారంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధికారులను ప్రశంసించారు. కాగా.. సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఏపీ పెవిలియన్‌కి ఐఐటీఎఫ్ జ్యూరీ అవార్డు ప్రకటించింది. -
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. "వోకల్ ఫర్ లోకల్ - లోకల్ టు గ్లోబల్" నేపథ్యంతో తీర్చిదిద్దిన పెవిలియన్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన 20 రకాల ఏటికొప్పాక, మ్యాంగో జెల్లి, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులను పెవిలియన్ లో ఉంచారు. వీటన్నిటినీ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద డ్వాక్రా, మెప్మా మహిళా సంఘాల కృషితో రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన వస్తువులైన గుంటూరు మిర్చి, ధర్మవరం పట్టు చీరలు, పావడాలు, కొండపల్లి బొమ్మలు, ఉదయగిరి చెక్కతో తీర్చిదిద్దిన ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, అరకు కాఫీ, ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు, మచిలీపట్నం కలంకారి, బందరు లడ్డు, తిరుపతి లడ్డు వంటి వస్తువులకు బ్రాండింగ్ పెంచి ప్రపంచ స్థాయిలో మరింత మార్కెట్ పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పెవిలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన సహా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, ఆంధ్ర భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ పెట్టుబడుల ప్రచారం, విదేశీవ్యవహారల సలహాదారు పీటర్ టీ హసన్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎన్వీ రమణా రెడ్డి ఐఆర్పీఎస్, హిమాన్షు కౌశిక్ ఐఏఎస్, లేపాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వాణిజ్య ఉత్సవ్ పేరుతో విజయవాడలో రెండు రోజులు నిర్వహిస్తున్న ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ కార్నివాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను సీఎం విడుదల చేయనున్నారు. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను కూడా ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎగుమతిదారులను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకి అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తోంది. 100 మందికిపైగా ఎగుమతిదారులు, రాయబారులు కోవిడ్ తర్వాత తొలిసారిగా బహిరంగంగా నిర్వహిస్తున్న వాణిజ్య సదస్సు కావడంతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో 100 మందికిపైగా ఎగుమతిదారులు, వివిధ దేశాల రాయబారులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్, వ్యవసాయం, వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఎగుమతిదారులకు కల్పిస్తున్న అవకాశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎగుమతిదారులు 20కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చివరిరోజున అత్యుత్తమ స్టాల్‌కు అవార్డులు ఇస్తారు. రాష్ట్రస్థాయి సదస్సు ముగిసిన తర్వాత ఈనెల 24 నుంచి 26 మధ్యలో జిల్లాల్లో స్థానిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే విధంగా జిల్లాస్థాయిలో వాణిజ్య ఉత్సవ్ సదస్సులు నిర్వహిస్తారు. -
ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవ్’
సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల రెట్టింపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి రాష్ట్రంలో ‘వాణిజ్య ఉత్సవ్–2021’ పేరిట ఈనెల 21, 22 తేదీల్లో విజయవాడలో భారీ వాణిజ్య సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వాణిజ్య ఉత్సవ్–2021 కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించే ఈ సదస్సులో విదేశీ రాయబారులతోపాటు 100 మందికిపైగా ఎగుమతిదారులు పాల్గొంటారని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రం దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను కలిగి ఉందని, దీన్ని 2030 నాటికి 10 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పోర్టులు, లాజిస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా రాష్ట్ర ఎగుమతుల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు ఒక ఉత్పత్తిని గుర్తించి వాటి ఎగుమతులు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు తొలుత రాష్ట్రస్థాయిలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందని, 24 నుంచి 26 వరకు జిల్లాల వారీగా కలెక్టర్ నేతృత్వంలో సదస్సులు జరుగుతాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండటంతో వీరికి అధికాదాయం అందించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్తు తెలిపారు. వాణిజ్య ఉత్సవ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతుల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం రూ.2,900 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి మేకపాటి వాణిజ్య ఉత్సవ్ లోగోను ఆవిష్కరించగా మంత్రి కన్నబాబు ఈవెంట్‌కి సంబంధించిన ఫ్లయర్‌ను విడుదల చేశారు. వాణిజ్య ఉత్సవంలో పాల్గొనేవారు నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రత్యేక వెబ్ పేజీని మంత్రులు ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ్‌లో పాల్గొనేవారు https:// apindustries. gov.in/ vanijyautsavam/ అనే వెబ్‌లింక్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఎంఎస్ఎంఈ చైర్మన్ వంకా రవీంద్రనాథ్, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది తదితరులు పాల్గొన్నారు. -
చైనా కరోనా స్వదేశీ వ్యాక్సిన్ల ప్రదర్శన
బీజింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలు పోటీ పడుతున్న సమయంలో, చైనా తన తొలి వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్‌లో సోమవారం స్వదేశీ వ్యాక్సిన్లను తొలిసారి ప్రదర్శించింది. దశ-3 ట్రయల్స్‌లో ప్రవేశించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి మార్కెట్లో రానున్నాయని తయారీదారుల అంచనా. చైనా కంపెనీలైన సినోవాక్ బయోటెక్, సినోఫార్మా ఈ టీకాని అభివృద్ధి చేస్తున్నాయి. టీకా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించామనీ, ఏడాదికి 300 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని సినోవాక్ ప్రతినిధి వెల్లడించారు. సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద అందజేసినట్టు సినోవాక్ సీఈఓ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. టీకా తీసుకున్న వారిలో తన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. మరోవైపు 1957లో అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన సోవియట్ ఉపగ్రహం ‘స్పుత్నిక్ వి’ పేరుతో తమ తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా గత నెలలో పేర్కొంది. కాగా క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్లు సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిరూపితమైనా ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ టీకాకు తుది ఆమోదం లభించని సంగతి తెలిసిందే. -
‘పారిశ్రామిక మహిళ’కు చేయూత
ఉద్యోగ అవకాశాల కోసం చూడటం కాదు.. ఉపాధి కల్పించే శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తోంది యువత. ఈ ప్రయత్నంలో మహిళలకూ చేయూతనిచ్చేందుకు, ఆర్థికవృద్ధిలో వారినీ భాగస్వాములను చేసి ప్రోత్సహించేందుకు ‘జీఈఎస్’ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమిట్–ప్రపంచ వాణిజ్య సదస్సు)ను నిర్వహిస్తున్నాయి పారిశ్రామికంగా బలపడాలనుకుంటున్న దేశాలు. అమెరికా, యూరప్ దేశాలతోపాటు భారత్ కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. హైదరాబాద్ వేదికగా ఈనెల 28న ఈ సదస్సు భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధిస్తున్న విజయాల గురించి మన దేశంలోని ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు భారత్‌లోని అమెరికన్ కాన్సులేట్ ఓ మినీ సదస్సును ఆ దేశంలో నిర్వహిస్తోంది. భారత్ నుంచి విలేకరులను అమెరికా తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా వివరిస్తోంది. ఆన్లైన్ వేధింపులకు చెక్ పెట్టేలా... సాంకేతికతలో ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నామో అంతే వేగంగా సమస్యలు పుట్టుకొస్తు న్నాయి. ఈ మధ్య మరీ ఎక్కువైన సమస్య సామాజిక మాధ్యమాల దుర్వినియోగం. ఈ చిక్కు నుంచి బయట పడేసే వెబ్ అప్లికేషన్లు ఇప్పుడు స్టార్టప్స్ దశలో ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఎక్కడ సరైన సంరక్షణ, పని, తిండి, దొరుకుతుందనే వివరాలను చెప్పి... వాళ్లు అక్కడికి వెళ్లే మార్గాలను సూచించే యాప్‌లూ వస్తున్నాయి. ఈ రకమైన స్టార్టప్స్‌కూ విపరీతమైన డిమాండ్ ఉందని వాషింగ్టన్ డీసీలో అఫినిస్ ల్యాబ్స్ అనే ఇంక్యుబేటర్‌ను నిర్వహిస్తున్న భారతీయ–అమెరికన్, చెన్నైకి చెందిన షాహిద్ అమానుల్లా నిరూపిస్తున్నారు. ఈయన మహిళలు కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులను సమీకరించడమో లేదా అలాంటి వేదికలను వారికి పరిచయం చేయడమో చేస్తారు. అమెరికా వచ్చే వారికి ఫెమిగ్రెంట్స్ ప్రోత్సాహం... ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ కంటెంట్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఐకా అలియేవా, ఫేస్బుక్లో లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ వింగ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య పోరెడ్డి (హైదరాబాద్) కలిసి ‘ఫెమిగ్రెంట్స్’ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అమెరికాకు వలస వస్తున్న మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఈ నెట్వర్క్ తోడ్పడుతుంది. విమెన్ ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయం సాధించి, స్థిరపడిన వాళ్లను కొత్త వారికి ఫెమిగ్రెంట్స్ పరిచయం చేస్తుంది. ప్రారంభంలో ఎలాం టి సమస్యలుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక సహాయం వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్తారు అలియేవా, లావణ్య. — వాషింగ్టన్ డీసీ నుంచి సరస్వతి రమ -
సౌతాఫ్రికా ట్రేడ్ ఫెయిర్ ఆరంభం
హైదరాబాద్: దక్షిణాఫ్రికా 6వ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ ఫెయిర్ సోమవారమిక్కడి మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో ఆరంభమయింది. దక్షిణాఫ్రికాకు చెందిన 26 కంపెనీలతో పాటు పలువురు భారతీయ ఇన్వెస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి మిజ్వాండిల్ మసీనా, ముంబయిలోని దక్షిణాఫ్రికా కాన్సుల్ జనరల్ పూల్ మల్ఫేన్ ఆరంభించారు.సాధారణ ఎగుమతులతో తమ ట్రేడ్ ఫెయిర్ ఆరంభమయిందని, దీని ద్వారా 2009-2014 మధ్య 44 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దక్షిణాఫ్రికాకు తరలి వచ్చాయని వారు తెలియజేశారు. ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి దక్షిణాఫ్రికా అనేది వ్యూహాత్మక కేంద్రమని ఈ సందర్భంగా మసీనా చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్వర్యంలో వ్యాపార రంగం అబివృద్ది, పెట్టుబడి అవకాశాలపై భారత్, సౌత్ఆప్రికా ప్రతినిదులు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ట్రేడ్ ఫెయిర్
న్యూఢిల్లీ: నగరంలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ‘అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన’ ప్రశాంతంగా ముగిసింది. నవంబర్ 14-27 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ప్రధానంగా ఎలాంటి దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, పిట్‌ప్యాకెటర్ల బెడద చోటు చేసుకోలేదు. సుమారు 10,00,000 మంది వివిధరంగాలకు చెందిన సందర్శకులు ప్రగతిమైదాన్‌లోని మెట్రో స్టేషన్‌ను వినియోగించుకొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్ఎఫ్) ఢిల్లీ మెట్రోలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని, దాని అధికార ప్రతినిధి హేమేం ద్ర సింగ్ తెలిపారు. ఆదివారం అత్యధికంగా 1,60,000 మంది సందర్శకులు వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బ్యాగ్‌ను వేరేచోట ఉంచి మరిచిపోవడం మినహా భారీ సంఘటనలు ఏమీ చోటుచేసుకోలేదని తెలిపారు. ప్రయాణికులు, ఫెయిర్‌కు వచ్చే సందర్శకులకు సీఆర్పీఎఫ్ మెరుగైన భద్రతా సేవలు కల్పించింది. స్టేషన్లో సుమారు 12 చోట్ల మెటల్ డిటెక్టర్లు, 6 ఎక్సరే బ్యాగేజ్ మిషన్లు, అదనపు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. -
తెలంగాణ సంస్కృతి చాటి చెప్పాం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో నిర్విహ స్తున్న ట్రేడ్ ఫెయిర్ ఓ వేదికగా నిలుస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డా. వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ ట్రేడ్ ఫెయిర్‌లో తెలంగాణ పెవిలి యన్‌కు అశేష ఆదరణ లభిస్తోందన్నారు. ట్రేడ్ ఫెయిర్‌లో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను ప్రగతిమైదాన్ లాల్‌చౌక్ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు వేణుగోపాలచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అనువైన పరిస్థితులున్నాయని, సింగిల్‌విండో పద్దతిలో కావాల్సిన అనుమతులు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని వివరించారు. తెలంగాణ కళారూపాలకు వందల ఏళ్లనాటి చరిత్ర ఉందని వివరించారు. పేరిణినాట్యం ఎంతో గొప్పదన్నారు. ఈ సందర్భగా కళాకారులు ప్రదర్శించిన పేరిణి నాట్యం అలరించింది. కళాకృష్ణ నేతృత్వంలో లయబద్దంగా కళాకారులు శ్రీధర్, వెంకట్, రమాదేవి, జయప్రద, పావనిలు అలరించారు. అనంతరం నిర్వహించిన ఖవ్వాలీకి అనూహ్య స్పందన లభించింది. ఉత్తరాదికి చెందిన పలువురు హైదరాబాదీ వార్సి సోదరుల ఖవ్వాలీకి మంత్రముగ్ధులయ్యారు. జనాబ్జీ మహబూబ్, జబ్బార్, అజిత్‌ఖాన్,సబీ తదితరులు అలరించారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్ నాయక్, తెలంగాణ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ అజయ్ మిశ్రా, ఇండస్ట్రీస్ కమిషనర్ జయేష్ రంజన్, ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్య ప్రదర్శనలతో రాష్ట్రాభివృద్ధి: చంద్రబాబు
* ఐఈఐఏ సదస్సులో సీఎం చంద్రబాబు * ట్రేడ్ఫెయిర్ల నిర్వహణకు పలు నగరాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని వెల్లడి * రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన సాక్షి, హైదరాబాద్: వాణిజ్య ప్రదర్శనల(ట్రేడ్ ఫెయిర్) ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నైపుణ్య, వైజ్ఞానిక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ట్రేడ్ ఫెయిర్ల నిర్వహణ కోసం రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న 20 ఏళ్లకు సరిపడా వాణిజ్యరంగ అవసరాలను ఈ కన్వెన్షన్ సెంటర్లు తీరుస్తాయన్నారు. శనివారం ఇక్కడి హైటెక్స్‌లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఐఈఐఏ)నిర్వహించిన సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల నిర్వహణవల్ల నగరాలు, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని వివరించారు. ఆఫ్రికాలోని నైగర్ ఏటా ప్రదర్శనలు, వాణిజ్య సదస్సుల నిర్వహణద్వారా ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసుకుంటోందన్నారు. వాణిజ్య ప్రదర్శనల ద్వారా జర్మనీకి ఏటా 23.5 బిలియన్ యూరోల ఆదాయం వస్తోందని, 2.26 లక్షల మందికి పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. ఇలాంటి వాణిజ్య ప్రదర్శనల ద్వారా అన్ని రంగాలమధ్య సమన్వయం, పరస్పర సహకారం కుదిరి ఏపీ కూడా త్వరిత గతిన ఆర్థికంగా అభివృద్ధి చెందగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్నుతీర్చిదిద్దుతా రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 14 ఎయిర్‌పోర్టులను, నాలుగు పోర్టులను నెలకొల్పి ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఫైబర్ ఆప్టెక్ ద్వారా ప్రతి ఇంటికీ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టూరిజంలో ఏపీని అగ్రభాగాన నిలుపుతానని చెప్పారు. వ్యవసాయం, పవర్‌గ్రిడ్, అర్బన్ డెవలప్మెంట్, గ్యాస్ కనెక్టివిటీ తదితర ఏడు అంశాలతో కూడిన మిషన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ సాధించేందుకు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడిందీ ఈ సందర్భంగా వివరించారు. సైబర్ టవర్స్‌తోపాటు హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వంటి నిర్మాణాలతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. నైపుణ్యం, ఉత్పాదకత పెంపుపై దృష్టి సారిస్తాం: చంద్రబాబు నైపుణ్యం పెంచటంద్వారా వివిధ రంగాల్లో ఉత్పాదకతను పెంచి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన నమూనాగా రూపొందించాలన్నది తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు చెప్పారు. శనివారం సీఎంను క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగృహంలో జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ) ఎండీ, సీఈవో దిలీప్ చెనాయ్ కలిశారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి ఏ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నమూనాలేంటీ.. వాటిలో ఆచరణ యోగ్యమైన పద్ధతులేమిటీ.. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధికి ఎన్ఎస్డీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. కేంద్రం నుంచి నిధులు ఎంతమేరకు వస్తాయి.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను నైపుణ్య అభివృద్ధికి ఎలా సమీకరించవచ్చు.. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఉత్పాదకతను నైపుణ్య అభివృద్ధిద్వారా ఎలా పెంచవచ్చు.. అనే అంశాలపై చెనాయ్‌తో ఈ సందర్భంగా సీఎం చర్చించారు. నైపుణ్యం పెంపుద్వారా వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపుపై నివేదిక ఇవ్వాలని కోరారు. త్వరలోనే నైపుణ్య అభివృద్ధి మిషన్‌ను ప్రారంభించేందుకు కావాల్సిన సహాయ సహకారాలను తమ సంస్థ అందిస్తుందని చెనాయ్ హామీనిచ్చారు. ఏడాదిలోగా దేశానికే ఆదర్శవంతమైన నమూనాను రూపొందించేందుకు ఎన్ఎస్డీసీ ముందుకొస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, గంటా సుబ్బారావు, డీవీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.