రాష్ట్ర నడిబొడ్డునే రాజధాని ఉండాలి
కర్నూలు: సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రం నడిబొడ్డునే ఏపీ రాజధానిని నిర్మిస్తే బాగుంటుదని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని రాష్ర్ట పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. కర్నూలునే మళ్లీ రాజధాని చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఇక్కడ రాజధాని ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏమిటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి సునీత పైవిధంగా సమాధానమిచ్చారు.
అయితే కర్నూలునే రాజధానిగా మళ్లీ ప్రకటించాలని కోరుకుంటున్న వారిలో తాను కూడా ఉంటానని తెలిపారు. ‘కర్నూలు, అనంతపురం జిల్లాలు రాష్ట్ర్రానికి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేస్తే మిగిలిన జిల్లాలకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రాజధాని నిర్మాణం రాష్ట్రం నడిబొడ్డునే ఉండాలి’ అని మంత్రి వివరించారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తనకు తెలుసుని, ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మార్కెట్‌యార్డులు, రైతు బజార్లలో దళారీ వ్యవస్థను అరికడతామని అన్నారు.