ఏపీ రాజధాని విజయవాడే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడే అవుతుందని స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. విజయవాడ పోరంకి వద్ద కామినేని హాస్పటల్ నూతన శాఖ ప్రాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ రాజధాని సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు. కాగా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశల వారీగా బెజవాడకు తరలించాలని సూచించారు.
ఇప్పటికే రెండు కీలక శాఖలు విజయవాడ నుంచి పనిచేస్తున్నాయి. నీటి పారుదల శాఖ కార్యకలాపాల కోసం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్యాంప్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. రాష్ట్ర స్థాయి సమీక్షలు మొత్తం విజయవాడలోనే సాగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా విజయవాడ నుంచే తన శాఖ కార్యకలాపాల వేగం పెంచారు. ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తన క్యాంపు కార్యాలయంతో పాటు, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించారు.
దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోని పోరంకిలో దేవాదాయశాఖ నిర్మించిన వృద్ధాశ్రమం భవనాలను తన క్యాంపు కార్యాలయంగా, ఆ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలుగా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం తన శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ఏర్పాట్లలో పడ్డారు. గృహ నిర్మాణ, అటవీ, పంచాయితీరాజ్, రహదారులు, భవనాల శాఖలను తొలుత తరలించే అవకాశం ఉంది.