సాక్షి, అమరావతి : ఓట్ల తొలగింపుల్లో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తమ అధికారులు తప్పు చేస్తే సస్పెండ్ చేసీ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వారం రోజుల క్రితం వరకు ఓట్ల తొలగింపు కోసం లక్షల దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమని ద్వివేది చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించిన తర్వాతే లొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపులో మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా 100పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. తెలంగాణలో వెలుగు చూసిన డేటా చోరీలో చాలా అంశాలు ఉన్నాయన్నారు. డేటా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డేటా చోరి సంగతి పోలీసులు, కోర్టులే తేల్చాలని చెప్పారు. ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఈసీ విడుదల చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment