సాక్షి, అమరావతి : దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఎక్కువ పరీక్షలు చేస్తున్నందుకే రాష్ట్రంలో కరోనా పాజిటిక్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,334 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అందులో 1259 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు.
(చదవండి : కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష)
పది లక్షలు జనాభాకు 1504 టెస్ట్‌లు చేస్తూ దేశం లో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. తమిళనాడులో 10 లక్షల మందికి 1103 పరీక్షలు, రాజస్థాన్ లో 1,077 పరీక్షలు చేశారని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్ రేట్ తక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ రేటు 4.13 గా ఉందని, మహారాష్ట్ర పాజిటివ్ రేటు 7.46గా, మధ్యప్రదేశ్ లో 8.44గా నమోదైందని, గుజరాత్ లో 6.62 అని, తమిళనాడులో 2.28 అని తెలిపారు. ఏపీలో పాజిటివ్ రేటు 1.57 మాత్రమేనని, అనేక రాష్ట్రాలతో పోల్చితే కరోనా నివారణ చర్యల్లో రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందన్నారు.
రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ రెడ్‌జోన్ల పరిధికి సంబంధించినవేనన్నారు. 1259 కేసుల్లో 809 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. మంగళవారం నమోదైన 82 కేసుల్లో 70 కేసులు ఈ మూడు జిల్లాలోనే నమోదైనట్లు జవహర్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment