రాష్ట్ర కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ, మంత్రుల బృందానికి నివేదిక పంపే విషయంలో కసరత్తు నేపథ్యంలో కాంగ్రెస్లో కాక రేగింది. పోటాపోటీ సమావేశాలతో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పనిలో పనిగా ఒకరిపై విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయిన తెలంగాణ నేతలు సీఎం కిరణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు సమాచారం. జీఓఎం, అఖిలపక్ష భేటీపై చర్చిచేందుకు పార్టీ తరపున రెండు సమావేశాలు ఎందుకు పెట్టారని బొత్సను తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిలదీసినట్టు తెలిసింది. సీమాంధ్ర నాయకులతోనే సీఎం సమావేశం నిర్వహించడాన్ని వారు తప్పుబట్టారు. తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. పార్టీ తరపున జీఓఎంకు ఒకే నివేదిక పంపాలని వారు పట్టుబడుతున్నారు.
అటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో భేటీ అయ్యారు. సాయంత్రం సీఎం కిరణ్ తో వారు సమావేశం కానున్నారు. బొత్సతో సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో మంతనాలు జరిపారు.