ఎస్.రాజమహేంద్రారెడ్డి:
మల్లికార్జున ఖర్గే ఇంట గెలిచారు. ఇక రచ్చ గెలవడానికి సన్నద్ధమవుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బాస్‌గా 80 ఏళ్ల వయసులో నియమితుడైనప్పుడు, పార్టీని గాడిలో పెట్టడం ఖర్గేకు తలకు మించి భారమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దశాబ్ద కాలంగా వరుస పరాజయాలతో, పరాభవాలతో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కాంగ్రెస్‌కు యువరక్తం ఎక్కిస్తే ఆ జోష్ వేరేగా ఉండేదని కూడా వ్యాఖ్యానించారు.
గాంధీల (సోనియా, రాహుల్)కే చేతకానిది ఈయన వల్ల అవుతుందా అంటూ పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. శనివారం ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూశాక చాలామందికి ఆయన నాయకత్వ పటిమపై అనుమానాలు పటాపంచలైపోయాయి. నిజానికి కాంగ్రెస్ సాధించిన ఈ విజయం మామూలుదా! ఇంకోపార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత కాళ్లమీద మరో ఐదేళ్లు మందగమనంతోనో, వాయువేగంతోనో పరుగెత్తగల ఆత్మవిశ్వాసాన్ని, సత్తాను కాంగ్రెస్‌కు అందించింది.
కర్ణాటక కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రగులుతున్న చిరకాల వైరాన్ని చల్లార్చడం ఎవరి తరమూ కాదన్న సమయంలో ఖర్గే జాతీయ అధ్యక్షుని హోదాలో రంగంలోకి దిగి చాకచక్యంగా ఆ అగ్నిని చల్లార్చారు. అదిగో అక్కడే, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటానికి ముందే, యుద్ధభూమిలోకి దిగకముందే కాంగ్రెస్‌కు సగం విజయాన్ని చేకూర్చారు.
అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొదలై ఓటేసే తేదీ వచ్చేదాకా సిద్ధరామయ్య, శివకుమార్ పల్లెత్తు మాట అనుకోకుండా ఆప్త మిత్రుల్లా కనిపించడం కర్ణాటక ఓటర్లలోకాంగ్రెస్‌పై నమ్మకాన్ని పెంచింది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఎన్నికలకు ముందే కర్ణాటక మీదుగా వెళ్లేట్టు వ్యూహరచన చేయడం కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ఈ రెండు అంశాల్లోనూ ఖర్గే వ్యూహాత్మకంగా వ్యవహరించి కన్నడిగుల మనసు కొల్లగొట్టారు. దాని ఫలితమే ఈ సానుకూల ఫలితాలు.
రాజస్తాన్ పరీక్షకు రెడీ
తన మొదటి లక్ష్యాన్ని జనం జేజేల మధ్య దిగ్విజయంగా చేరుకున్న ఖర్గే తదుపరి లక్ష్యంవైపు దృష్టి సారించారు. బెంగళూరులో మోగిన విజయదుందుభి 1,921 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ప్రతిధ్వనించింది. ఒకరకంగా ఇది రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఖర్గే మోగించిన నగారా! అంతర్గత పోరుతో సతమతమవుతున్న అక్కడి పార్టీ వ్యవహారాలను కొలిక్కి తేవడం ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. సీఎం గహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చాల్సి ఉంది. సీన్ రాజస్తాన్‌కు మారుతుంది. అదే సీన్, అదే దర్శకుడు. పాత్రలే మారతాయి. అంతే. చేయి తిరిగిన దర్శకుడు గనుక అక్కడా లక్ష్యాన్ని చేరతారంటున్నారు.
గహ్లోత్– పైలట్ విభేదాలు తారస్థాయికి
2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన పైలట్‌ను కాదని గహ్లోత్‌కు పట్టం కట్టడంతో వారి మధ్య అగ్గి రాజుకుంది. ఐదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి అది కాస్తా కార్చిచ్చులా వ్యాపించింది. సొంత పార్టీ మీద, ముఖ్యమంత్రి మీదా అలిగి ధర్నా చేసేందుకూ పైలట్ వెనకాడలేదంటే ఆయనలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్లో తనను వరించి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని గహ్లోత్ తృణీకరించారు.
సీఎం పదవే ముద్దంటూ బింకానికి పోయారు. అప్పటికే ఆయన పేరిట 12 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. అధిష్టానం కోరికను, లేదా ఆదేశాన్ని మన్నించకుండా రాష్ట్రానికే పరిమితమైన గహ్లోత్‌కు, తన స్థానంలో అధ్యక్షుడైన ఖర్గే ముందు చేతులు జోడించి నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విభేదాలు పక్కన పెడతారా, అధిష్టానం ముందు హాజరవుతారా అంటూ ఖర్గే ఇప్పటికే ఆ ఇద్దరికీ తాఖీదు పంపించారు. గాంధీల ఆశీర్వాదంతో అధ్యక్షుడైన ఖర్గే కర్ణాటక విజయంతో మరో మెట్టు పైకి చేరుకున్నారు.
పార్టీలో ఇప్పుడు ఆయన మాటలకు తిరుగులేదు. త్వరలోనే గహ్లోత్, పైలట్‌లను పిలిచి బుజ్జగించడమో, తప్పదనుకుంటే హెచ్చరించడమో తప్పని పరిస్థితిలో ఖర్గే ఉన్నారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదురీదడం కాంగ్రెస్‌కు కష్టమేనన్నది అంతర్గత నివేదికల సారాంశం. ఈ నివేదికల నేపథ్యంలో ఖర్గే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవసరమైన పథకాలను సిద్ధం చేసుకుంటున్నారు. పక్షం రోజుల ముందే సీనియర్ నేతలు కమల్‌నాథ్, వేణుగోపాల్ ద్వారా సచిన్‌కు రాయబారం పంపారు.
విభేదాలు పక్కన పెడితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పిస్తానని ఆశ చూపారు. పైలట్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో పైలట్‌ను రాజస్తాన్ పీసీసీ అధ్యక్షునిగా నియమించాలన్నది ఖర్గే మరో ఆలోచనగా ఉంది. పార్టీ టికెట్ల విషయంలో, మంత్రివర్గంలో కొన్ని స్థానాల విషయంలో తనమాట చెల్లితే అభ్యంతరం లేదని పైలట్ భావిస్తున్నట్టు వినికిడి.
అయితే ఈ ప్రతిపాదనకు సమ్మతించేది లేదని గహ్లోత్ బాహాటంగానే స్పష్టం చేశారు. దీనికి విరుగుడుగా పైలట్ ఈ నెల చివరి వారంలోనో, వచ్చే నెల మొదటి వారంలోనో పార్టీని చీల్చడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి (జూన్ 11) నాటికి పైలట్ చీలిక వర్గాన్ని తయారు చేసి తీరతారంటున్నారు. అదే జరిగితే వీరి వ్యవహారాన్ని అధిష్టానం మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముంది.
గహ్లోత్, పైలట్ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ నిర్ణయానికి బద్ధులుగా ఉండాలన్నది అధిష్టానం మాటగా ఖర్గే హితవు చెబుతున్నారు. గాంధీలు కూడా ఖర్గే మాటే ఫైనల్ అన్న సంకేతాన్ని పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చి రాజస్తాన్‌లోనూ పార్టీని ఎన్నికల యుద్ధక్షేత్రంలో సమర్థంగా ముందుకు నడపడం ఖర్గేకు పెద్ద కష్టమేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment