ఢిల్లీ: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కాగా, రాజస్థాన్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావాలంటే సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే.. అశోక్ గెహ్లాట్ , సచిన్ పైలట్‌తో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం కానున్నారు. ఢిల్లీలో నేడు ఇరువురు నేతలతో ఖర్గే వేర్వేరుగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు, వారిమధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగునున్నట్లు తెలుస్తున్నది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి 15 రోజుల్లో విచారణ జరిపించాలని ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సచిన్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణ చేపట్టాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ‘అవినీతికి వ్యతిరేకంగా తాను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’ అని పైలట్ హెచ్చరించారు. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.
మరోవైపు.. అశోక్ గెహ్లాట్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన జన సంఘర్షణ్ పేరుతో అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాదయాత్ర నిర్వహించారు. గెహ్లాట్ ప్రభుత్వం కనుక విచారణ చేపట్టని పక్షంలో తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు. అంతటితో ఆగకుండా సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇది కూడా చదవండి: అమిత్ షా ఎంట్రీ.. ఇక మణిపూర్‌లో ఏం జరగనుంది?
Comments
Please login to add a commentAdd a comment