internal conflict
-
సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు పార్టీ నాయకత్వానికి ముందు చెప్పడంలేదా? తానే పీసీసీ చీఫ్ కావడంతో పార్టీకి చెప్పక్కర్లేదని రేవంత్ అనుకుంటున్నారా? సమాచారం తెలియకే ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంలో పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారా? పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెరగడానికి కారణం ఏంటి? గత కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేముందు కనీసం పార్టీలో సీనియర్లతో అయినా చర్చించరా అంటూ అవేదన వెళ్ళగక్కుతున్నారు. ఏ అంశం మీదైనా ప్రభుత్వం సడెన్‌గా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము గుడ్డిగా సమర్దించాలా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారట సదరు సీనియర్ నేతలు.కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాలు ఇచ్చినట్లుగా అవుతోంది. విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా బదులివ్వాలి కదా అని ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేత అనడంతో.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మాకు ముందుగా చెబుతున్నారా అని సీఎంఓ కార్యాలయంలోని ఆ నేతను ప్రశ్నించారట సీనియర్లు. మూడు రోజుల క్రితం సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించడంతో, దొడ్డు వడ్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకున్నస్థాయిలో కౌంటర్స్ రావడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకు మాట్లాడటంలేదని అడిగితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేముందు మాకు కనీస సమాచారం అయినా ఇస్తే.. దాని వల్ల తలెత్తే ఇబ్బందులను అంచనా వేసుకుని ప్రతిపక్షాల మీద దాడికి సిద్ధం అవుతాం కదా అని రివర్స్ అవుతున్నారట కొందరు సీనియర్ వరి ధాన్యం కొనుగోలు విషయం మాత్రమే కాదు, రైతు బంధు, కరెంటు వంటి పలు విషయాలలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ కనిపిస్తోంది. విపక్షాలు చేసే విమర్శలను కౌంటర్ చేయడానికి తమకు సమాచారం ఇచ్చేవారే లేరని పార్టీ నాయకులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడే సీఎం కావడంతో ఆయన నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. దీంతో పార్టీ నేతలు సీఎం రేవంత్‌ను కలవడానికి అవకాశం లేకుండాపోతోంది. దీంతో విపక్షాల విమర్శలకు ఎలా స్పందించాలో తోచక, తమకు ఎందుకులే అనుకుని కొందరు నేతలు సైలెంట్ అవుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయడానికి ఎవరైనా సీనియర్ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే సీఎంకు సలహా ఇచ్చారట. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం సహజంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. కాని టీ.కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి ఓ నేత ఉండేవారు. ఏదైనా అంశం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందో లేక తర్వాతో..పార్టీ తీసుకోవాల్సిన లైన్‌పై నాయకులకు క్లియర్‌గా వివరించేవారు. అయితే ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అలాంటి ఏర్పాటు లేకపోవడం వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం చేసేందుకు సీఎం రేవంత్‌కు సన్నిహతుడైన ఓ కీలక నేతకు బాధ్యత అప్పగించాలని భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం రాజకీయ సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఆయనకే సమన్వయం బాధ్యత అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
Rajasthan Congress Crisis: ఓవర్ టు రాజస్తాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: మల్లికార్జున ఖర్గే ఇంట గెలిచారు. ఇక రచ్చ గెలవడానికి సన్నద్ధమవుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బాస్‌గా 80 ఏళ్ల వయసులో నియమితుడైనప్పుడు, పార్టీని గాడిలో పెట్టడం ఖర్గేకు తలకు మించి భారమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దశాబ్ద కాలంగా వరుస పరాజయాలతో, పరాభవాలతో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కాంగ్రెస్‌కు యువరక్తం ఎక్కిస్తే ఆ జోష్ వేరేగా ఉండేదని కూడా వ్యాఖ్యానించారు. గాంధీల (సోనియా, రాహుల్)కే చేతకానిది ఈయన వల్ల అవుతుందా అంటూ పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. శనివారం ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూశాక చాలామందికి ఆయన నాయకత్వ పటిమపై అనుమానాలు పటాపంచలైపోయాయి. నిజానికి కాంగ్రెస్ సాధించిన ఈ విజయం మామూలుదా! ఇంకోపార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత కాళ్లమీద మరో ఐదేళ్లు మందగమనంతోనో, వాయువేగంతోనో పరుగెత్తగల ఆత్మవిశ్వాసాన్ని, సత్తాను కాంగ్రెస్‌కు అందించింది. కర్ణాటక కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రగులుతున్న చిరకాల వైరాన్ని చల్లార్చడం ఎవరి తరమూ కాదన్న సమయంలో ఖర్గే జాతీయ అధ్యక్షుని హోదాలో రంగంలోకి దిగి చాకచక్యంగా ఆ అగ్నిని చల్లార్చారు. అదిగో అక్కడే, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటానికి ముందే, యుద్ధభూమిలోకి దిగకముందే కాంగ్రెస్‌కు సగం విజయాన్ని చేకూర్చారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొదలై ఓటేసే తేదీ వచ్చేదాకా సిద్ధరామయ్య, శివకుమార్ పల్లెత్తు మాట అనుకోకుండా ఆప్త మిత్రుల్లా కనిపించడం కర్ణాటక ఓటర్లలోకాంగ్రెస్పై నమ్మకాన్ని పెంచింది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఎన్నికలకు ముందే కర్ణాటక మీదుగా వెళ్లేట్టు వ్యూహరచన చేయడం కూడా కాంగ్రెస్‌కు లాభించింది. ఈ రెండు అంశాల్లోనూ ఖర్గే వ్యూహాత్మకంగా వ్యవహరించి కన్నడిగుల మనసు కొల్లగొట్టారు. దాని ఫలితమే ఈ సానుకూల ఫలితాలు. రాజస్తాన్ పరీక్షకు రెడీ తన మొదటి లక్ష్యాన్ని జనం జేజేల మధ్య దిగ్విజయంగా చేరుకున్న ఖర్గే తదుపరి లక్ష్యంవైపు దృష్టి సారించారు. బెంగళూరులో మోగిన విజయదుందుభి 1,921 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ప్రతిధ్వనించింది. ఒకరకంగా ఇది రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఖర్గే మోగించిన నగారా! అంతర్గత పోరుతో సతమతమవుతున్న అక్కడి పార్టీ వ్యవహారాలను కొలిక్కి తేవడం ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. సీఎం గహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చాల్సి ఉంది. సీన్ రాజస్తాన్‌కు మారుతుంది. అదే సీన్, అదే దర్శకుడు. పాత్రలే మారతాయి. అంతే. చేయి తిరిగిన దర్శకుడు గనుక అక్కడా లక్ష్యాన్ని చేరతారంటున్నారు. గహ్లోత్– పైలట్ విభేదాలు తారస్థాయికి 2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించిన పైలట్‌ను కాదని గహ్లోత్‌కు పట్టం కట్టడంతో వారి మధ్య అగ్గి రాజుకుంది. ఐదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి అది కాస్తా కార్చిచ్చులా వ్యాపించింది. సొంత పార్టీ మీద, ముఖ్యమంత్రి మీదా అలిగి ధర్నా చేసేందుకూ పైలట్ వెనకాడలేదంటే ఆయనలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్‌లో తనను వరించి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని గహ్లోత్ తృణీకరించారు. సీఎం పదవే ముద్దంటూ బింకానికి పోయారు. అప్పటికే ఆయన పేరిట 12 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. అధిష్టానం కోరికను, లేదా ఆదేశాన్ని మన్నించకుండా రాష్ట్రానికే పరిమితమైన గహ్లోత్‌కు, తన స్థానంలో అధ్యక్షుడైన ఖర్గే ముందు చేతులు జోడించి నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విభేదాలు పక్కన పెడతారా, అధిష్టానం ముందు హాజరవుతారా అంటూ ఖర్గే ఇప్పటికే ఆ ఇద్దరికీ తాఖీదు పంపించారు. గాంధీల ఆశీర్వాదంతో అధ్యక్షుడైన ఖర్గే కర్ణాటక విజయంతో మరో మెట్టు పైకి చేరుకున్నారు. పార్టీలో ఇప్పుడు ఆయన మాటలకు తిరుగులేదు. త్వరలోనే గహ్లోత్, పైలట్లను పిలిచి బుజ్జగించడమో, తప్పదనుకుంటే హెచ్చరించడమో తప్పని పరిస్థితిలో ఖర్గే ఉన్నారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదురీదడం కాంగ్రెస్‌కు కష్టమేనన్నది అంతర్గత నివేదికల సారాంశం. ఈ నివేదికల నేపథ్యంలో ఖర్గే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవసరమైన పథకాలను సిద్ధం చేసుకుంటున్నారు. పక్షం రోజుల ముందే సీనియర్ నేతలు కమల్‌నాథ్, వేణుగోపాల్ ద్వారా సచిన్‌కు రాయబారం పంపారు. విభేదాలు పక్కన పెడితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పిస్తానని ఆశ చూపారు. పైలట్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో పైలట్‌ను రాజస్తాన్ పీసీసీ అధ్యక్షునిగా నియమించాలన్నది ఖర్గే మరో ఆలోచనగా ఉంది. పార్టీ టికెట్ల విషయంలో, మంత్రివర్గంలో కొన్ని స్థానాల విషయంలో తనమాట చెల్లితే అభ్యంతరం లేదని పైలట్ భావిస్తున్నట్టు వినికిడి. అయితే ఈ ప్రతిపాదనకు సమ్మతించేది లేదని గహ్లోత్ బాహాటంగానే స్పష్టం చేశారు. దీనికి విరుగుడుగా పైలట్ ఈ నెల చివరి వారంలోనో, వచ్చే నెల మొదటి వారంలోనో పార్టీని చీల్చడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి (జూన్ 11) నాటికి పైలట్ చీలిక వర్గాన్ని తయారు చేసి తీరతారంటున్నారు. అదే జరిగితే వీరి వ్యవహారాన్ని అధిష్టానం మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశముంది. గహ్లోత్, పైలట్ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ నిర్ణయానికి బద్ధులుగా ఉండాలన్నది అధిష్టానం మాటగా ఖర్గే హితవు చెబుతున్నారు. గాంధీలు కూడా ఖర్గే మాటే ఫైనల్ అన్న సంకేతాన్ని పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చి రాజస్తాన్‌లోనూ పార్టీని ఎన్నికల యుద్ధక్షేత్రంలో సమర్థంగా ముందుకు నడపడం ఖర్గేకు పెద్ద కష్టమేమీ కాదు. -
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామసామి తిరస్కరించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు(సోమవారం) జరగనున్న సర్వసభ్య సమావేశంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సాగుతున్న ఆధిపత్యపోరుకు తెరపడుతుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. అసలు కథ ఏంటంటే.. అన్నాడీఎంకేలో ఒక ఒరలో రెండుకత్తులు ఇమడవన్నట్లుగా ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పన్నీర్‌సెల్వంను పక్కనపెట్టడం ద్వారా ప్రధాన కార్యదర్శిగా అవతరించాలని ఎడపాడి ఎత్తులు వేయడం ప్రారంభించగానే.. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తక్కువకాదన్నట్లు పైఎత్తులతో న్యాయపోరాటానికి దిగారు. గత నెల 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం వేదికగా ఈపీఎస్, ఓపీఎస్ మద్దతుదారులు భౌతికదాడులకు కూడా సాహసించారు. పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించమే శ్రేయస్కరమనే స్థాయికి ఎడపాడి వర్గం సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవరాం మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా పన్నీర్‌పై రాజకీయ బాణం ఎక్కుపెట్టనున్నారు. ఎడపాడిని ప్రధాన కార్యదర్శిని చేయడం, పన్నీర్‌సెల్వంను ఇంటిబాట పట్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మెజార్టీ వర్గం ఎడపాడి పంచన చేరిపోవడంతో సర్వసభ్య సమావేశం జరగకుండా స్టే కోరుతూ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుండగా 9 గంటలకు తీర్పు చెబుతామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రెండురోజుల క్రితం ప్రకటించారు. కోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా ఎడపాడి వర్గీయులు ఆదివారం సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. పన్నీర్ ఆశిస్తున్నట్లుగా స్టే మంజూరవుతుందా..? లేక ఎడపాడి ఏర్పాట్లకు అనుగుణంగా సర్వసభ్య సమావేశానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా..? అని ఇరువర్గాలు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ఇదిగాక, రూ.4,800 కోట్ల టెండర్ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగం కింద ఎడపాడి పళనిస్వామిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ప్రారంభం కానుండటం ఆయన మద్దతుదారులకు మరో తలనొప్పిగా మారింది. చదవండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’ ఎవరికి వారు.. ఈపీఎస్, ఓపీఎస్ ఎవరికివారు సర్వసభ్య సమావేశానికి సమాయత్తం అవుతున్నారు. ‘విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం’ అన్నట్లుగా ఎడపాడి, పన్నీర్ మద్దతుదారులు కార్లు, వ్యాన్లు, బస్సుల్లో, మరికొందరు విమానాల్లో ఆదివారం చెన్నైకి చేరుకున్నారు. సుమారు 2,650 మంది కోసం చెన్నై నగరం, శివార్లలోని లగ్జరీ హోటళ్లలో ముందుగానే రిజర్వ్ చేసుకున్న గదుల్లో బసచేసి ఉన్న తమ వర్గం నేతలతో ఈపీఎస్, ఓపీఎస్ సమాలోచనల్లో మునిగిపోయారు. వీరుగాక నేతలు, కార్యకర్తలతో హోటళ్లన్నీ నిండిపోయాయి. పార్టీపరంగా 75 జిల్లాలకు గాను 70 జిల్లాల కార్యదర్శులు ఎడపాడి వైపు ధీమాగా నిలిచి ఉన్నారు. ఎడపాడి దూకుడును అడ్డుకోవడం ఎలా.. అని న్యాయనిపుణులతో ఓపీఎస్ ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ఓపీఎస్ మరోసారి మద్దతుదారులతో సమావేశం అవుతుండగా, ఎలాంటి వ్యూహం పన్నుతాడోనని ఎడపాడి వర్గం అప్రమత్తంగా గమనిస్తోంది. సమావేశం జరుపుకునేలా తీర్పు వెలువడటంతో పన్నీర్‌సెల్వం సహా ఆయన మద్దతుదారులు కార్యక్రమాన్ని బహిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
‘370’ భారత అంతర్గత వ్యవహారం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు అనేది భారత అంతర్గత వ్యవహారమని కశ్మీర్లో పర్యటిస్తున్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్ల బృందం పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కశ్మీర్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు ఈయూ పార్లమెంటేరియన్ల బృందం భారత్‌కు రావడం తెల్సిందే. కశ్మీర్‌పై అంతర్జాతీయ మీడియా వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, అక్కడికి వెళ్లాక ఇక్కడి వాస్తవ పరిస్థితిని వారికి వివరిస్తామని తమ పర్యటన అనంతరం ఈయూ ఎంపీలు తెలిపారు. కశ్మీరీలు తాము భారతీయులమనే భావిస్తున్నారని, వారు శాంతియుత భవిష్యత్తునే కోరుకుంటున్నారని వివరించారు. తమను ఫాసిస్టులు అంటూ ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అతిపెద్ద తప్పు.. కశ్మీర్లోకి ఈయూ పార్లమెంటేరియన్ల బృందాన్ని అనుమతించడం భారత విదేశాంగ విధాన చరిత్రలోనే అతిపెద్ద తప్పిదంగా కాంగ్రెస్ అభివర్ణించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత్‌ను అవమానపరుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. -
తర్వాతి టార్గెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్?
లోక్‌సభ ఎన్నికల్లో విజయోత్సాహంతో కర్ణాటకలో ఆపరేషన్ కమలానికి తెరతీసిన బీజేపీ తదుపరి లక్ష్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పోరుని, వృద్ధతరం, యువతరం మధ్య కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో అంతర్గత పోరు బీజేపీకి కలిసొస్తుందా ? మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగి, 114 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 109 స్థానాలను సంపాదించింది. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినా, బీజేపీకి కూడా 109 సీట్లు ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనైతే మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్య సయోధ్య అంతగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సింధియా రాజీనామా చేసిన వెంటనే, ఆయనను జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయన మద్దతు దారులు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పదవీ దాహంతో సీఎం కుర్చీని వదలట్లేదని∙విమర్శిస్తున్నారు. కమల్‌నాథ్‌పై 1984 సిక్కు అల్లర్ల కేసు, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు ఉండగా, కేంద్రం వీటిపై దృష్టి సారిస్తోంది. రాజస్తాన్‌లో అంత ఈజీ కాదు మొత్తం 200 స్థానాలున్న రాజస్తాన్‌లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు ఒక్క సీటు దూరంలో ఉండిపోయింది. 99 స్థానాలు గెలుచుకొని ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు బీజేపీకి 73 స్థానాలు రావడంతో రాజస్తాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఈజీకాదు. రాజస్తాలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు అధికార కేంద్రాలతో ఆ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగడం లేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి వీరిద్దరి మధ్య కూడా పోరు నడుస్తోంది. ఒకవైపు అనుభవం,మరోవైపు యువరక్తం.. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఇవే పరిస్థితులు కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకి తెరతీశాయి. ఈ పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలైతే చేస్తుంది కానీ రాజస్తాన్‌లో నెంబర్ గేమ్ బీజేపీకి అనుకూలంగా లేదు. కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమేనా? కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల వారీగా బలహీనపడినప్పటికీ అది జాతీయ పార్టీ అవ్వడం వల్ల దానికి కలిగే నష్టం అంతగా ఉండదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నింటినో కాంగ్రెస్ ఇప్పటికే చూసింది. 1967 సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలింది. కానీ 1975లో అత్యవసర పరస్థితి తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట అధఃపాతాళానికి పడిపోయింది. కానీ, 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో 414 స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు లేకపోయినా ఆ పార్టీ పనైపోయిందని అనుకోవడానికి వీల్లేదు. -
కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై బీజేపీ అగ్రనేతల భేటీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గురువారమిక్కడ సమావేశమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన దర్భంగ ఎంపీ కీర్తి అజాద్ పై సస్పెన్షన్ వేటు నేపథ్యంలో పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా తదితరులు భేటీ అయ్యారు. కీర్తి అజాద్ విషయంపై వారు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బహిష్కరణ వేటు పడిన కీర్తి ఆజాద్‌కు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. నిజాయతీ గల నాయకుడిని పార్టీ వదులుకోదంటూ ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా సస్పెన్షన్ పై కీర్తి ఆజాద్ స్పందిస్తూ తనకు నోటీసులు అందాయని, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. -
పట్టుబట్టి.. కట్టబెట్టి..
వ్యాస్ కోటలో కాసుల వేట రూ.1.70 కోట్లు {పజాధనం దుర్వినియోగం అదనపు అంతస్తులు వద్దన్నా వినని పోలీస్ బాస్ కేంద్రమంత్రి కోర్టులో పంచాయితీ తాత్కాలికంగాపనులకు బ్రేక్ బందరురోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్‌పై రగడ మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లు, రెండు ప్రభుత్వ కీలక శాఖల మధ్య అంతర్గత వివాదం వెరసి రూ.1.70 కోట్ల ప్రజాధనం వృథా అయింది. చివరకు ఈ పంచాయితీ టీడీపీకి చెందిన ఓ కేంద్రమంత్రి వద్దకు చేరింది. కేవలం ఒక పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పిల్లర్ల వద్ద నిలిచిపోయింది. ప్రాజెక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు తప్పుకోవటం మొదలు వారం రోజుల కిందట శ్లాబ్‌లు వేయటానికి వీలుగా ఏర్పాటుచేసిన సెంట్రింగ్ తొలగించటంతో కథ తాత్కాలికంగా ముగిసినా విలువైన ప్రజాధనం మాత్రం దుర్వినియోగమైంది. విజయవాడ : బందరురోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ నగర పోలీస్ కమిషనరేట్ ఆధీనంలో ఉంది. కిందిభాగంలో షాపింగ్ కాంప్లెక్స్, రెండో అంతస్తులో ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాలు ఉన్నాయి. సుమారు ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. ఈ క్రమంలో దానిపై మూడు, నాలుగు అంతస్తులు నిర్మించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు పంపి దానికి ఆమోదముద్ర వేయించారు. దీంతో ఆర్అండ్బీ నిధులు రూ.1.70 కోట్లతో రెండంతస్తులు పోలీస్ కార్యాలయాల కోసం నిర్మించాలని భావించారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. శాఖాపరంగా అభివృద్ధిపై దృష్టిసారించటం మంచిదే కానీ, ఆయన పూర్తి ఏకపక్షంగా, అడ్డగోలుగా వ్యవహరించటం వల్లే సమస్య ఉత్పన్నమైంది. అసలు కథ ఇదీ.. వాస్తవానికి ఆర్‌అండ్‌బీలో రహదారులు, బ్రిడ్జిలు నిర్మించే విభాగం ఒకటి, ప్రభుత్వ భవనాలు నిర్మించే విభాగం మరొకటి ఉన్నాయి. భవనాలు నిర్మించే విభాగం దీనిని బాధ్యతగా తీసుకుని టెండర్లు పిలవాల్సి ఉంది. అందుకు భిన్నంగా రహదారులు, బ్రిడ్జిలు నిర్మించే విభాగం టెండర్లు పిలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కాలవ్యవధితో టెండర్లు ఆహ్వానించగా, దానిని నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు సంయుక్తంగా దక్కించుకున్నారు. దీంతో మళ్లీ పోలీస్ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లతో తమశైలిలో మాట్లాడి టెండర్ నుంచి తప్పించి తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. దీంతో ఎట్టకేలకు ఆరు నెలల కిందట పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్అండ్బీ విభాగం అధికారులు భవనాన్ని పరిశీలించి భవన సామర్థ్యం, పిల్లర్ల బలం, సాయిల్ పరీక్షలు నిర్వహించారు. భవన సామర్థ్యం సరిపోదని, మరో రెండు అంతస్తులు నిర్మిస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. వాస్తవానికి ఆర్అండ్బీ అధికారులు నివేదిక ఇచ్చాక మొదలుకావాల్సిన పనులు దానితో నిమిత్తం లేనట్టుగానే మొదలుపెట్టారు. దీంతో సదరు అధికారి బదిలీ వరకు పనులు జరిగాయి. అధికారి బదిలీతో నిలిచిపోయాయి. ఈ విషయమై పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి, ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్లు ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద పంచాయితీ పెట్టారు. పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొ రేషన్ ఒత్తిడి తీసుకురాగా, నిర్మాణం కుదరదని ఆర్అండ్బీ అధికారులు తేల్చిచెప్పారు. మరోవైపు ఓ పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకుని నిర్మించాల్సిందేనని ఒత్తిడి తేచ్చారు. ఈలోగా ప్రాజెక్ట్ కాలవ్యవధి మూడు నెలలు కూడా పూర్తి కావటంతో రెండు రోజుల కిందట శ్లాబ్‌ల కోసం అమర్చిన సెంట్రింగ్ పనులు నిలిపివేసి చెక్కలు తొలగించారు. కేంద్రమంత్రి వద్ద పంచాయితీ ఈ క్రమంలో ఈ భవనాన్ని ఎలా అయినా పూర్తి చేయించాలని, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి దీనిని పూర్తి చేయించాలని సదరు పోలీస్ ఉన్నతాధికారి కేంద్రమంత్రిని కోరి ఆయన వద్ద పంచాయితీ పెట్టారు. ఇటీవల నగరానికి వచ్చిన సదరు అమాత్యుడు పంచాయితీని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. దీనిపై ఆర్అండ్బీ ఎస్ఈ శేషు కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ భవనం సామర్థ్యం పరీక్షలు నిర్వహించగా పటుత్వం లేదని నిర్ధారించారని, దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. -
అంతర్గత విభేదాల వల్లే ఓడిపోయా: జయసుధ
-
అంతర్గత విభేదాల వల్లే ఓడిపోయా: జయసుధ
హైదరాబాద్: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల వల్లే తాను ఓడిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ చెప్పారు. 2009 శాసనసభ ఎన్నికల్లో జయసుధ రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి కూడా అదే పార్టీ తరపున అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభించలేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా యూత్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలన్నారు. యూత్‌కాంగ్రెస్‌కు ఎన్నికలు జరపడం మంచిది కాదని జయసుధ అభిప్రాయపడ్డారు.