లోక్‌సభ ఎన్నికల్లో విజయోత్సాహంతో కర్ణాటకలో ఆపరేషన్ కమలానికి తెరతీసిన బీజేపీ తదుపరి లక్ష్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పోరుని, వృద్ధతరం, యువతరం మధ్య కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో అంతర్గత పోరు బీజేపీకి కలిసొస్తుందా ?
మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగి, 114 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 109 స్థానాలను సంపాదించింది. ఎస్పీ, బీఎస్పీ సహకారంతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసినా, బీజేపీకి కూడా 109 సీట్లు ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనైతే మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్య సయోధ్య అంతగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సింధియా రాజీనామా చేసిన వెంటనే, ఆయనను జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిని చేయాలంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయన మద్దతు దారులు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పదవీ దాహంతో సీఎం కుర్చీని వదలట్లేదని∙విమర్శిస్తున్నారు. కమల్‌నాథ్‌పై 1984 సిక్కు అల్లర్ల కేసు, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు ఉండగా, కేంద్రం వీటిపై దృష్టి సారిస్తోంది.
రాజస్తాన్‌లో అంత ఈజీ కాదు
మొత్తం 200 స్థానాలున్న రాజస్తాన్‌లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు ఒక్క సీటు దూరంలో ఉండిపోయింది. 99 స్థానాలు గెలుచుకొని ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటు బీజేపీకి 73 స్థానాలు రావడంతో రాజస్తాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఈజీకాదు. రాజస్తాలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు అధికార కేంద్రాలతో ఆ రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగడం లేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి వీరిద్దరి మధ్య కూడా పోరు నడుస్తోంది. ఒకవైపు అనుభవం,మరోవైపు యువరక్తం.. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఇవే పరిస్థితులు కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకి తెరతీశాయి. ఈ పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలైతే చేస్తుంది కానీ రాజస్తాన్‌లో నెంబర్ గేమ్ బీజేపీకి అనుకూలంగా లేదు.
కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమేనా?
కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల వారీగా బలహీనపడినప్పటికీ అది జాతీయ పార్టీ అవ్వడం వల్ల దానికి కలిగే నష్టం అంతగా ఉండదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నింటినో కాంగ్రెస్ ఇప్పటికే చూసింది. 1967 సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలింది. కానీ 1975లో అత్యవసర పరస్థితి తర్వాత ఆ పార్టీ ప్రతిష్ట అధఃపాతాళానికి పడిపోయింది. కానీ, 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో 414 స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు లేకపోయినా ఆ పార్టీ పనైపోయిందని అనుకోవడానికి వీల్లేదు.
తర్వాతి టార్గెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్?
Published Tue, Jul 9 2019 4:14 AM | Last Updated on Tue, Jul 9 2019 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment