కీర్తి ఆజాద్ సస్పెన్షన్పై బీజేపీ అగ్రనేతల భేటీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గురువారమిక్కడ సమావేశమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన దర్భంగ ఎంపీ కీర్తి అజాద్ పై సస్పెన్షన్ వేటు నేపథ్యంలో పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా తదితరులు భేటీ అయ్యారు. కీర్తి అజాద్ విషయంపై వారు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బహిష్కరణ వేటు పడిన కీర్తి ఆజాద్కు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. నిజాయతీ గల నాయకుడిని పార్టీ వదులుకోదంటూ ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆజాద్పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా సస్పెన్షన్ పై కీర్తి ఆజాద్ స్పందిస్తూ తనకు నోటీసులు అందాయని, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు.