నన్ను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ తనను సస్పెండ్ చేయడంపై ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించారు. తానేం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానని తనను సస్పెండ్ చేశారని బీజేపీ అధినాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని, గతంలోనే పార్టీ పెద్దలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో పార్టీదే బాధ్యత అని, తనదేం తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్లుగా తాను ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాని, తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. నిజాలు మాట్లాడేవారిని బీజేపీ నుంచి గెంటేస్తున్నారని, మున్ముందు ఇంకా ఏం జరుగనుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అవినీతి వ్యవహారంలో అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా ఆరోపణలు చేశారు. దీనిపై కన్నెర్ర జేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.