'దమ్ముంటే నన్ను పార్టీ నుంచి గెంటేయండి'
న్యూఢిల్లీ: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా పార్టీని ఇరకాటంలో పెట్టేలా తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీకి తలనొప్పిగా వ్యవహరించిన ఈ షాట్‌గన్ ఆ తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు. దీంతో పార్టీ అసమ్మతి ఎంపీ కీర్తి ఆజాద్ తరహాలో శత్రుఘ్నపై కూడా బీజేపీ చర్యలు తీసుకునే అవకాశముందని వినిపిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన శత్రుఘ్న దమ్ముంటే బీజేపీ తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ చేశారు. పార్టీ నుంచి తనను తొలగించినా తన పంథా మారదని ఆయన స్పష్టం చేశారు.
'నేను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదు. అయినా నన్ను వారు పార్టీని గెంటేయాలనుకుంటే గెంటేయ్యవచ్చు. కానీ చర్యకు తగిన ప్రతి చర్య కూడా ఉంటుందన్న న్యూటన్ మూడో సిద్ధాంతాన్ని వారు గుర్తించాలి' అని శత్రుఘ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ వ్యవహారంలో ఆరోపణలు చేసి బిహార్ బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ బీజేపీ నుంచి సస్పెండైన సంగతి తెలిసిందే. అయినా శత్రుఘ్న తన పంథాను మార్చలేదు. కీర్తి ఆజాద్‌ను హీరో అని పొగుడుతూ.. బీజేపీని ఇరకాటంలో పడేసే విధంగా ఆయన ట్విట్టర్‌లో బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.